ఫిబ్రవరి 4.. (సినీ చరిత్రలో ఈరోజు)

* టాలీవుడ్‌ యాంగ్రీ స్టార్

మాస్‌ కథానాయకులకి తెలుగులో కొదవలేదు. అప్పటికే చాలామంది మాస్‌ ఇమేజ్‌తో కొనసాగుతున్నారు. అలాంటి సమయంలోనే వచ్చిన రాజశేఖర్‌ వెండితెరపై తనదైన ముద్రవేశారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకొని తిరుగులేని కథానాయకుడిగా ఎదిగాడు. ఆయన తెరపై అమాయకంగా కనిపించాడంటే చాలు. థియేటర్లలో కన్నీళ్లు ఒలకాల్సిందే, కుటుంబ ప్రేక్షకులు బాక్సాఫీసు దగ్గర క్యూ కట్టాల్సిందే. ఇక ఆవేశం ప్రదర్శించారంటే అదే థియేటర్లు మాస్‌ ప్రేక్షకులతో హోరెత్తిపోవల్సిందే. ఇటు కుటుంబ కథానాయకుడిగానూ, అటు యాంగ్రీ యంగ్‌మేన్‌గానూ అలరించి విజయాల్ని సొంతం చేసుకొన్నారు రాజశేఖర్‌. నటుడిగా ఎలాంటి పాత్రల్లోనైనా ఒదిగిపోగలనని నిరూపించుకొన్నారు. తమిళనాడులోని తేని జిల్లా, లక్ష్మీపురంలోని వరదరాజన్, ఆండాలు దంపతులకి 1962 ఫిబ్రవరి 4న జన్మించారు రాజశేఖర్‌. ఎమ్‌.బి.బి.ఎస్‌ పూర్తి చేసిన ఆయన మద్రాస్‌లో కొంతకాలం పాటు వైద్యవృత్తిని కొనసాగించారు. 1985లో ‘వందేమాతరం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రమే ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ‘ప్రతిఘటన’, ‘రేపటి పౌరులు’, ‘స్టేషన్‌ మాస్టర్‌’, ‘శ్రుతిలయలు’, ‘కాష్మోరా’, ‘ఆరాధన’, ‘తలంబ్రాలు’, ‘అరుణకిరణం’, ‘మమతల కోవెల’, ‘అక్క మొగుడు’ తదితర చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు. ‘ఆహుతి’, ‘అర్తనాదం’, ‘న్యాయం కోసం’, ‘అంకుశం’, ‘మగాడు’, ‘రౌడీయిజం నిశించాలి’, ‘మొరటోడు నా మొగుడు’, ‘అన్న’, ‘పాపకోసం’, ‘బలరామకృష్ణులు’, ‘ఆగ్రహం’, ‘శివయ్య’, ‘ఎవడైతే నాకేంటి’ తదితర చిత్రాలు ఆయనకి యాంగ్రీ యంగ్‌మేన్‌గా గుర్తింపు తీసుకొచ్చాయి. ఆî ేశపూరితమైన పాత్రల్లో ఒదిగిపోవడంలో దిట్టగా పేరు తెచ్చుకొన్నారు రాజశేఖర్‌. మరోపక్క కుటుంబ కథల్లోనూ ఆయన అంతే చక్కగా ఒదిగిపోయారు. ‘మా ఆయన బంగారం’, ‘సూర్యుడు’, ‘సింహరాశి’, ‘మా అన్నయ్య’, ‘దీర్ఘ సుమంగళీ భవ’, ‘మనసున్న మారాజు’, ‘గోరింటాకు’ తదితర చిత్రాలతో రాజశేఖర్‌ కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ‘ఓంకారం’, ‘శేషు’ చిత్రాలు ఆయన నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించాయి. తమిళంలోనూ పలు చిత్రాలు చేసి ప్రేక్షకుల్ని అలరించినా... ఆయన తెలుగులోనే స్థిరపడిపోయారు. రాజశేఖర్‌కి ప్రముఖ నటుడు సాయికుమార్‌ గాత్రం అందిస్తుంటారు. మధ్యలో కొన్నాళ్లపాటు వరుసగా పరాజయాలు చవిచూసిన రాజశేఖర్‌ ‘పి.ఎస్‌.వి.గరుడవేగ’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం ‘కల్కి’లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. 1980 నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో రాజశేఖర్ యాంగ్రీ స్టార్ అయ్యారు. తనతో కలిసి పలు చిత్రాల్లో నటించిన కథానాయిక జీవితని 1991లో వివాహం చేసుకొన్నారు రాజశేఖర్‌. ఈ దంపతులకి అమ్మాయిలు శివానీ, శివాత్మిక ఉన్నారు. శివాని ప్రస్తుతం కథానాయికగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈరోజు రాజశేఖర్‌ పుట్టినరోజు.

* నాజూకు సుందరి! (ఊర్మిళ పుట్టినరోజు)


బాలీవుడ్‌ తెరపై ఆమె రాక ఓ సంచలనం. ఓర చూపులతోనే సినీ ప్రియులకు మత్తెక్కిస్తూ.. తన అందచందాలతో వారిని ఊహల లోకంలో ఊరేగించిన దేవకన్య ఆమె. ఆతరం ఈతరం అని తేడా లేకుండా తనదైన అభినయంతో కోట్లాది మంది అభిమానుల మదిలో కలల రాణిగా మారింది. ‘యాయిరే..యాయిరే..హోజా రంగీలా రే’ గీతంతో దేశవ్యాప్తంగా ఆమె చేసిన సందడి అసామాన్యమైనది. ఆ పాటలో ఆమె వేసిన స్టెప్పులకు కశ్మిర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రేక్షకలోకమంతా పూనకాలతో ఊగిపోయింది. ఇలా అందం, అభినయం.. అదరగొట్టే నాట్య పరిమళాలతో వెండితెరను ఏలిన ముద్దుగుమ్మే ఊర్మిళ. అసలు పేరు ఊర్మిళ మటోండ్కర్‌. సెన్సేషనల్‌ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఒకనొక దశలో వర్మ ఆస్థాన కథానాయికగా సూపర్‌ పాపులారిటీని సొంతం చేసుకొంది. 1980లో వచ్చిన ‘కలియుగ్‌’ సినిమాతో బాలనటిగా వెండితెరపై మెరిసిన ఈ సొగసుల చిన్నది.. ఆ తర్వాతి కాలంలో తెలుగు, తమిళ, మలయాళ, మరాఠా భాషా చిత్రాల్లోనూ సందడి చేసింది. 1983లో వచ్చిన హిందీ సినిమా ‘నర్సింహ’తో పూర్తిస్థాయి వెండితెర నాయికగా మారిన ఊర్మిళ.. ఆ తర్వాత మరాఠా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. ఊర్మిళకు మంచి పేరు తీసుకొచ్చిన తొలి చిత్రం శేఖర్‌ కపూర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘మాసూమ్‌’. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుతో షారుఖ్‌ ఖాన్‌ సరసన ‘చమత్కార్‌’లో నటించే అవకాశం దక్కించుకొంది. ఆ వెంటనే కమల్‌హాసన్‌ కథానాయకుడిగా మలయాళంలో వచ్చిన ‘చాణక్యన్‌’ చిత్రంలో నటించి మెప్పించింది. అయితే చిత్రసీమలో ఊర్మిళకు హాట్‌ హాట్‌ సుందరిగా ఫుల్‌ క్రేజ్‌ను తెచ్చిపెట్టింది మాత్రం రామ్‌గోపాల్‌ వర్మ అనే చెప్పాలి. ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌లు ‘అంతం’,‘గాయం’ సినిమాలతో తెలుగు తెరపై సందడి చేసిన ఊర్మిళ.. ఆ తర్వాత బహుభాషా చిత్రం ‘ద్రోహి’తో దేశవ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకొంది. ఇక 1995లో వర్మ తెరకెక్కించిన ‘రంగీలా’ సినిమాతో ఊర్మిళ సృష్టించిన అలజడి మామూలుది కాదు. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘‘యాయిరే.. యాయిరే..’’ పాటతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాక రూ.15కోట్లకు పైగా వసూళ్లు సాధించి చిత్రసీమ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రంతోనే ఊర్మిళ మొదటి ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ను అందుకొంది. అంతేకాదు ఈ సినిమాకు మొత్తం 12 ఫిలింఫేర్‌లు దక్కడం విశేషం. ఈ జోరులోనే వర్మ దర్శకత్వంలో ‘అనగనగా ఒక రోజు’, ‘దౌడ్‌’, ‘సత్య’, ‘కౌన్‌’, ‘మస్త్‌’, ‘జంగల్‌’, ‘ప్యార్‌తూనే క్యాకియా’, ‘భూత్‌’,‘ ఏక్‌ హసీనా థీ’ సినిమాల్లో నటించి మెప్పించింది.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* అమెరికా యుద్ధ వీరుడు!
ఏ దేశానికైనా ఆ దేశం తరఫున జరిగిన యుద్ధాలు, వాటిలో విజయాలు చిరస్మరణీయంగా మిగిలిపోతాయి. ఆయా విజయాల వివరాలు పలు కళారూపాల్లో ఒదిగిపోయి ప్రజలను అలరిస్తూ ఉంటాయి. అలా అమెరికా తరఫున రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ట్యాంక్‌ కమాండర్‌గా పనిచేసిన జనరల్‌ జార్జి ఎస్‌. ప్యాటన్‌ జీవితం గురించి అక్కడి ప్రజల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఆయన వివరాలతో, యుద్ధ నేపథ్యంలో తీసిన సినిమా ‘ప్యాటన్‌’ (1970). ‘ప్యాటన్‌: ఆర్డియల్‌ అండ్‌ ట్రయంఫ్‌’, ‘ఎ సోల్జర్స్‌ స్టోరీ’ అనే పుస్తకాల ఆధారంగా తీసిన ఈ సినిమా 7 ఆస్కార్‌ అవార్డులు అందుకుంది. దాదాపు 12 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీసిన ఈ సినిమా, 61 మిలియన్‌ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో వేర్వేరు ప్రాంతాలకు సైన్యాన్ని నడిపించిన ప్యాటన్‌ విజయాలతో పాటు అతని కోపం, అనుచరులతో ప్రవర్తించే తీరు, అహంకారం లాంటి అంశాలను కూడా చిత్రీకరించారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.