ఫిబ్రవరి 6.. (సినీ చరిత్రలో ఈరోజు)

* నిర్వహణలో నిబద్ధత
(అట్లూరి రామారావు వర్థంతి-2015)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* చాప్లిన్‌ తీసిన తొలి పూర్తిస్థాయి చిత్రం!ప్రపంచ ప్రఖ్యాతి పొందిన హాస్య నటుడు చార్లీ చాప్లిన్‌ ఎన్నో చిన్న చిన్న సినిమాలు తీసి నవ్వులు రువ్వించాడు. అతడు తొలిసారిగా తీసిన పూర్తి నిడివి చిత్రం ‘ద కిడ్‌’ (1921). దీనికి చాప్లిన్‌ నిర్మాత, దర్శకుడు, నటుడు, రచయిత కూడా. నిశ్శబ్ద చలన చిత్ర చరిత్రలోనే మేటి సినిమాగా గుర్తింపు తెచ్చుకున్న ఇది, అప్పట్లోనే అత్యధిక వసూళ్లు సాధించి ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డను అనాధ ఆశ్రమం దగ్గర వదిలేసిన ఓ తల్లి ఆత్మహత్య చేసుకోడానికి వెళ్లిపోతే, కొందరు ఆ బిడ్డను చెత్తకుప్పలో పారేస్తారు. ఆ బిడ్డను తెచ్చుకుని పెంచడానికి చార్లీచాప్లిన్‌ ఏం చేశాడనేది కథ. పిల్లాడితో అతడి బంధం, ఇద్దరూ కలిసి చేసే అల్లరి, కొనేళ్ల తర్వాత అసలు తల్లి రావడం, అనాథ ఆశ్రమం వారి ఫిర్యాదుపై పోలీసుల రంగప్రవేశం, పిల్లాడిని వాళ్లు తీసుకెళ్లినప్పుడల్లా చాప్లిన్‌ వాడిని తిరిగి ఎత్తుకొచ్చేయడం... ఇలాంటి సన్నివేశాల మధ్య నవ్విస్తూనే, కంటతడి పెట్టిస్తుందీ సినిమా. రెండున్నర లక్షల డాలర్ల ఖర్చుతో తీసిన ఈ 68 నిమిషాల సినిమా, 54 లక్షల డాలర్లను వసూలు చేసింది.

* అమెరికా అధ్యక్షుడైన నటుడు!


ఓ పేద కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు... రకరకాల పనులు చేస్తూ ఎదిగి... నటుడిగా పేరు తెచ్చుకుని... చివరికి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాడు. అతడే అమెరికా 40వ అధ్యక్షుడు రోనాల్డ్‌ విల్సన్‌ రీగన్‌. ఇల్లినాయిస్‌లో 1911 ఫిబ్రవరి 6న పుట్టిన రోనాల్డ్‌ విల్సన్‌ రీగన్‌ చిన్నప్పటి నుంచే చురుగ్గా ఉంటూ ‘జాక్‌ ఆఫ్‌ ఆల్‌ ట్రేడ్స్‌’ అనిపించుకున్నాడు. తండ్రి జాక్‌ ఓ సేల్స్‌మన్‌. తల్లి నెల్లీ క్లైడ్‌ మత సంబంధ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేది. రోనాల్డ్‌ రీగన్‌ హైస్కూలు రోజుల నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. నటనతో పాటు, ఆటలు, స్టోరీటెల్లింగ్‌ కళలలో పాలు పంచుకున్నాడు. ఈత నేర్చుకునే వారికి, జల క్రీడల్లో పాల్గొనేవారికి ప్రమాదాలు జరిగితే వెంటనే వారిని రక్షించే ‘లైఫ్‌గార్డ్‌’ పని అతడి మొదటి ఉద్యోగం. ఆరేళ్ల ఉద్యోగంలో అతడు 77 మందిని కాపాడాడు. కాలేజి రోజుల్లో క్యాంపస్‌ రాజకీయాలు, క్రీడలు, నాటకాల్లో బహుముఖంగా ప్రతిభ చూసిస్తూ పాల్గొనేవాడు. డిగ్రీ చేతికొచ్చాక రేడియో ఎనౌన్సర్‌గా పనిచేశాడు. క్రీడా పోటీలపై వ్యాఖ్యానాలు చేసేవాడు. ఆ తర్వాత ‘వార్నర్‌ బ్రదర్స్‌’ స్టూడియోస్‌ స్క్రీన్‌ టెస్ట్‌లో పాల్గొని నటుడయ్యాడు. తొలిసారిగా ‘లవ ఈజ్‌ ఆన్‌ ద ఎయిర్‌’ (1937)లో నటించాడు. ఆపై రెండేళ్లలోనే 19 సినిమాల్లో రకరకాల పాత్రల్లో మెరిశాడు. ‘డార్క్‌ విక్టరీ’, ‘శాంటా ఫెట్రైల్‌’, ‘క్నుటే రాక్నే ఆల్‌ అమెరికన్‌’, ‘కింగ్స్‌ రో’, ‘ద వాయిస్‌ ఆప్‌ ద టర్టిల్‌’, ‘జాన్‌ లవ్స్‌ మేరీ’, ‘ద హ్యాస్టీ హార్ట్‌’, ‘క్యాటిల్‌ క్వీన్‌ ఆఫ్‌ మోంటానా’, ‘ద కిల్లర్స్‌’ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. టీవీల్లో స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా ప్రజల దృష్టిని ఆకట్టుకున్నాడు. ఆపై ఆయన అడుగులు నెమ్మదిగా రాజకీయ రంగం వైపు పడ్డాయి. కాలిఫోర్నియా గవర్నర్‌గా రెండుసార్లు ఎన్నికై మంచి కార్యక్రమాలతో పేరు తెచ్చుకున్నారు. ఆపై అమెరికా అధ్యక్షపీఠాన్ని అధిరోహించి మంచి కార్యదక్షుడిగా పేరొందారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.