సెప్టెంబర్‌ 13... (సినీ చరిత్రలో ఈరోజు)
* అలనాటి అందాల నటి!
గానం... నటన... అందం... చలాకీతనం. ఇవి చాలవూ ఓ ఆడపిల్ల ప్రపంచాన్ని శాసించడానికి? ఇవన్నీ ఉన్నాయి కాబట్టే క్లాడటే కోల్‌బర్ట్‌ హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న అందాల నటిగా పేరు పొందింది. ఆస్కార్‌ సహా ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. నాటక, టీవీ, ఫ్యాషన్, సినీ రంగాలు ఆమె కోసం ఎర్రతివాచీలు పరిచాయి. రెండు దశాబ్దాల కాలం ఆమెకు ఎదురులేకపోయింది. ‘ఇట్‌ హ్యాపెన్డ్‌ వన్‌ నైట్‌’ (1934) సినిమా ఆమెకు ఆస్కార్‌ను అందించింది. ‘క్లియోపాత్రా’ (1934), ‘ద పామ్‌ బీచ్‌ స్టోరీ’ (1942) లాంటి సినిమాలు ఆమెకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చాయి. హాలీవుడ్‌ క్లాసిక్‌ సినిమాల్లో గొప్ప నటీమణిగా అమెరికన్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆమెను 1999లో గుర్తించి గౌరవించింది.

* ‘బంపర్‌ ఆఫర్‌’ హీరో! (సాయిరామ్‌ శంకర్‌ పుట్టిన రోజు)
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ సోదరుడు సాయిరామ్‌ శంకర్‌. అన్న అడుగు జాడల్లోనే నడుస్తూ మొదట దర్శకత్వంవైపు దృష్టిపెట్టారు. ‘బద్రి’, ‘బాచి’, ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’, ‘ఇడియట్‌’, ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, ‘శివమణి’, ‘భద్ర’ తదితర చిత్రాలకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ‘ఇడియట్‌’తో నటుడిగా మారాడు. అందులో రవితేజకి మిత్రుడుగా తళుక్కు మెరిసి ఆకట్టుకున్న ఆయన, ‘143’తో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలోనే తెరకెక్కిన చిత్రమిది. ఆ తర్వాత ‘డేంజర్‌’లో కార్తీక్‌ అనే పాత్రని పోషించి అలరించాడు. ద్విపాత్రాభినయం చేస్తూ ‘హలో ప్రేమిస్తారా’ అనే చిత్రంలో నటించారు. దిల్‌రాజు సంస్థ నుంచి వచ్చిన చిత్రమిది. కథానాయకుడిగా కలిసి రాకపోవడంతో మరోమారు ‘నేనింతే’లో ఓ కీలకపాత్రలో మెరిశారు. పూరి జగన్నాథ్‌ మరోమారు తన తమ్ముడిని నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా సొంత సంస్థలోనే ‘బంపర్‌ ఆఫర్‌’ అనే చిత్రం నిర్మించారు. ఆ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించినా, ఆ తర్వాత విజయాల్ని అందుకోలేకపోయారు. ‘వాడే కావాలి’, ‘యమహో యమః’, ‘వెయ్యి అబద్దాలు’, ‘దిల్లున్నోడు’ తదితర చిత్రాలు చేసినా అదృష్టం కలిసిరాలేదు. రామ్‌ శంకర్‌ అని పేరు మార్చుకొన్నా విజయాలు మాత్రం దక్కలేదు. విశాఖ జిల్లా, నర్సీపట్నం సమీపంలోని కొత్తపల్లిలో జన్మించిన సాయిరామ్‌ శంకర్‌ పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేశారు. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. వనజ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఈ దంపతులకి జనన్య అనే ఓ పాప ఉన్నారు. ఈ రోజు సాయిరామ్‌ శంకర్‌ పుట్టినరోజు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.