మార్చి 16.. (సినీ చరిత్రలో ఈరోజు)

* సృజనాత్మక ముద్ర

(సముద్రాల రాఘవాచార్య -1968)

తెలుగు చిత్రసీమను సృజనాత్మక బాట పట్టించిన వ్యక్తుల్లో సముద్రాల రాఘవాచార్య ఒకరు. రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా, నేపథ్య గాయకుడిగా కూడా ఆయన చిరస్మరణీయమైన ముద్ర వేశారు. మాటలు రాసినా, పాటలు రాసినా అవి సినీ అభిమానుల నాలుకలపై నాట్యం చేశాయి. వినాయక చవితి (1957), భక్త రఘునాథ్‌ (1960), బభృవాహన (1964) సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. గుంటూరు జిల్లా పెదపులిపర్రులో 1902 జులై 19న పుట్టిన ఈయన తొమ్మిదో తరగతి చదివే వయసులోనే కవిత్వం చెప్పగలిగాడు. భాషా ప్రవీణ చదివి స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నారు. సహాయ సంపాదకునిగా కొన్ని పత్రికల్లో కూడా పనిచేశారు. ఈయన ప్రతిభను సినీ పరిశ్రమ తొందరగానే గుర్తించి అక్కున చేర్చుకుంది. ‘కనకతార’ (1937)తో మాటలు, పాటల రచయితగా మారిన సముద్రాల ఆ తర్వాత 80 చిత్రాల్లో వెయ్యికి పైగా పాటలు రాశారు. ‘గృహలక్ష్మి’, ‘భక్త పోతన’, ‘చెంచులక్ష్మి’, ‘స్వర్గసీమ’, ‘త్యాగయ్య’, ‘యోగి వేమన’, ‘లైలామజ్ను’, ‘షావుకారు’, ‘దేవదాసు’, ‘విప్రనారాయణ’, ‘అనార్కలి’, ‘జయసింహ’, ‘దొంగరాముడు’, ‘తెనాలి రామకృష్ణ’, ‘భూకైలాస్‌’, ‘సీతారామ కళ్యాణం’, ‘భక్తజయదేవ’, ‘నర్తనశాల’, ‘పాండవ వనవాసం’, ‘లవకుశ’, ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘శ్రీకృష్ణ తులాభారం’, ‘భక్త ప్రహ్లాద’లాంటి ఎన్నో సినిమాలు ఆయనలోని సృజనాత్మకతకు దర్పణాలు. ‘శ్రీరామకథ’ సినిమాకు ఆయన చివరి పాటను రాశారు. సినీ రంగాన్ని తన పాండిత్యంతో పరిపుష్టం చేసిన ఆయన 1968 మార్చి 16న మరణించారు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* కింగ్‌ ఆఫ్‌ కామెడీ


కమేడియన్లు చాలా మందే ఉంటారు, కానీ వారిలో ‘కింగ్‌’ అనిపించుకోవడం కష్టమే. ఆ గుర్తింపును సాధించిన నటుడే జెర్రీ లూయిస్‌. హాలీవుడ్‌లో ఏకంగా 80 ఏళ్ల సినీ ప్రస్థానం. నటుడిగా, గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్‌ రచయితగానే కాకుండా మానవతా వాదిగా కూడా పేరు సంపాదించిన నేపథ్యం. ‘ద నట్టీ ప్రొఫెసర్‌’, ‘ద డెలికేట్‌ డెలింక్వెంట్, ‘ద శాడ్‌ శాక్‌’, ‘డోన్ట్‌ గివప్‌ ద షిప్‌’, ‘ద బెల్లీ బాయ్‌’, ‘ద లేడీస్‌ మ్యాన్‌’లాంటి ఎన్నో సినిమాల్లో హాస్యనటనతో మెప్పించాడు. ఇతడి సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా 800 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేయడం విశేషం. న్యూజెర్సీలో 1926 మార్చి 16న పుట్టిన ఇతగాడు 1951 నుంచి 1965 మధ్య కాలంలో సోలో కమేడియన్‌గా అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. స్వచ్ఛంద సంస్థల ద్వారా సామాజిక సేవ చేసి మానవతావాదిగా కూడా పేరు పొందిన ఇతడు, 2017 ఆగస్టు 20న తన 91 ఏళ్ల వయసులో మరణించాడు.

* మేటి చిత్రాల రూపశిల్పి


ఓ మంచి సినిమా చూస్తే ‘దర్శకుడు ఎవరు?’ అని తెలుసుకుని మరీ గుర్తు పెట్టుకుంటారు సినీ అభిమానులు. అలా ప్రపంచ వ్యాప్తంగా ఎందరికో మరుపురాని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు బెర్నార్డో బెట్రొలూసి. ఇటలీకి చెందిన ఈయన మంచి కవి కూడా. అందువల్లనేనేమో, అతడి సినిమాలు కూడా కవితాత్మకంగా, రంగుల స్వప్నంలాగా ఉంటాయని చెబుతుంటారు అతడి అభిమానులు. ఆ ప్రతిభ ఏంటో తెలియాలంటే అంతర్జాతీయంగా ఆకట్టుకున్న ‘లిటిల్‌ బుద్ధ’, ‘ద లాస్ట్‌ ఎంపరర్‌’, ‘ద కన్ఫర్మిస్ట్‌’, ‘లాస్ట్‌ ట్యాంగో ఇన్‌ ప్యారస్‌’, ‘ద షెల్టరింగ్‌ స్కై’, ‘స్టీలింగ్‌ బ్యూటీ’, ‘ద డ్రీమర్స్‌’ లాంటి సినిమాలు చూడాలి. రెండు ఆస్కార్‌ అవార్డులతో పాటు కేన్స్‌ చిత్రోత్సవంలో ప్రతిష్ఠాత్మకమైన ‘పామె డిఓర్‌’ పురస్కారాన్ని కూడా పొందిన ఈయన, ఇటలీలో 1941 మార్చి 16న పుట్టి రోమ్‌లో పట్టభద్రుడయ్యేసరికే కవిగా, రచయితగా పేరు తెచ్చుకున్నాడు. ఇరవై రెండేళ్లకే మెగాఫోన్‌ పట్టుకుని దర్శకుడిగా మారాడు. ప్రత్యేకమైన దర్శకత్వ శైలికి పేరు పడిన ఈయన తన 77వ ఏట 2018 నవంబర్‌ 26న మరణించారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.