సెప్టెంబర్‌ 1 (సినీ చరిత్రలో ఈరోజు)
* మరపురాని పాటల మాలలు కట్టిన వాడు!
(సంగీత దర్శకుడు పువ్వుల రమేష్‌నాయుడు వర్థంతి- 1988)
తెలిసీ తెలియని వయసులో గాయకుడిగా పేరు తెచ్చుకోవాలని ముంబై రైలెక్కేసిన ఓ విజయవాడ కుర్రాడు, బాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకుని, ఆ తర్వాత తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో అద్భుతమైన పాటల్ని అందించాడు. ‘రచ్చ గెలిచి ఇంట గెలిచి’న అతడే రమేష్‌నాయుడు. తపన, కృషి ఉంటే ఎవరైనా అనుకున్న లక్ష్యం సాధిస్తారని చెప్పడానికి ఉదాహరణగా నిలిచిన ఇతడి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా?

* భయానక చిత్రాల్లో గొప్పది!
చనిపోయిన వాళ్లంతా తిరిగి బతికి నరమాంస భక్షకులుగా మారుతారు. వాళ్లంతా అమెరికాపైకి దండెత్తుతారు. ఇంతకన్నా ఓ భయానక చిత్రానికి కావలసిన కథేముంటుంది? ఈ కథాంశంతో తీసిన ‘డాన్‌ ఆఫ్‌ ద డెడ్‌’ సినిమా 1978 సెప్టెంబర్‌ 1న విడుదలై విజయం సాధించింది. ఇది అంతకు ముందు వచ్చిన ‘నైట్‌ ఆఫ్‌ ద లివింగ్‌ డెడ్‌’ సినిమాకు కొనసాగింపుగా వచ్చింది. ఈ సినిమా గొప్ప భయానక చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దాదాపు 1.5 మిలియన్‌ డాలర్లతో తీసిన ఈ సినిమా 55 మిలియన్‌ డాలర్లను వసూలు చేసి ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను భయపెట్టింది.

* ఉత్కంఠ రేకెత్తించిన హిచ్‌కాక్‌!
ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ పేరు చెబితే చాలు, ఉత్కంఠభరిత చిత్రాల దర్శకుడిగా ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు గుర్తిస్తారు. ఆ మేటి దర్శకుడు తీసిన చిత్రాల్లోకెల్లా ఉత్తమమైనదిగా పేరు తెచ్చుకున్న చిత్రమే ‘రేర్‌ విండో’. సినీ ప్రేక్షకులు, విమర్శకులు, సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని గొప్ప మిస్టరీ థ్రిల్లర్‌గా అంగీకరించారు. టెక్నికలర్‌లో తీసిన ఈ సినిమా 1954 సెప్టెంబర్‌ 1న విడుదలై అంతర్జాతీయంగా పేరుతెచ్చుకుంది. కార్నెల్‌ ఊల్‌రిచ్‌ అనే రచయిత రాసిన ‘ఇట్‌ హేడ్‌ టుబి మర్డర్‌’ కథ ఆధారంగా హిచ్‌కాక్‌ తీసిన ఈ సినిమాలో ప్రఖ్యాత నటుడు జేమ్స్‌ స్టివార్డ్, గ్రేస్‌కెల్లీ నటించారు.


కథేంటి?: ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ జెఫ్‌ కాలు విరగడంలో చక్రాల కుర్చీకి పరిమితమవుతాడు. తన అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటూ ఏమీ తోచక బైనాక్యులర్స్‌ సాయంతో ఎదురుగా ఉండే అపార్ట్‌మెంట్‌లోని వాళ్లను గమనిస్తూ ఉంటాడు. ఓ తుపాను రాత్రి ఓ మహిళ కేకతో పాటు, అద్దం పగిలిన శబ్దం రావడంతో మేలుకుని బైనాక్యులర్స్‌తో చూస్తాడు. అక్కడొక వ్యక్తి ఓ పెద్ద కత్తిని, రంపాన్ని శుభ్రపరచడం, ఓ పెద్ద ట్రంకు పెట్టిని బయటకు తీసుకు వెళ్లడం చూస్తాడు. అతడు తన భార్యను చంపి శవాన్ని మాయం చేస్తున్నాడని భావిస్తాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడైన డిటెక్టివ్‌కి, తనని చూడ్డానికి వచ్చిన స్నేహితురాలికి చెబుతాడు. మర్నాడు రాత్రి అదే అపార్ట్‌మెంట్‌లో వేరే ఇంటివారి కుక్క చనిపోతుంది. అది కూడా ఆ వ్యక్తి పనే అని అనుకుంటాడు. అయితే ఎలాంటి ఆధారాలూ దొరకవు. స్నేహితురాలు సాహసం చేసి ఆ ఇంట్లోకి ప్రవేశించి ఆ వ్యక్తికి బందీ అవుతుంది. ఎదురింటికి చెందిన జెఫ్‌ తనను గమనించాడని తెలుసుకున్న ఆ వ్యక్తి అతడిని చంపడానికి వస్తాడు. చివరకి ఈ కేసు ఎలా ముగిసిందనేదే కథ. ఒక మిలియన్‌ డాలర్లతో తీసిన ఈ సినిమా 36.8 మిలియన్‌ డాలర్లు ఆర్జించింది. ఈ సినిమా స్క్రీన్‌ ప్లే, షాట్‌ డివిజన్స్, కథను నడిపిన తీరు, సంభాషణలు... ఇలా ప్రతి అంశం ప్రపంచ సినీ రూపకర్తలకు ఓ పాఠంగా ఇప్పటికీ ఉపయోగపడుతున్నాయి. ఈ సినిమా ఎన్నో అవార్డులు, ప్రశంసలు పొందింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.