సెప్టెంబర్‌ 15... (సినీ చరిత్రలో ఈరోజు)
* సృజనాత్మక దర్శకుడు! (కె.వి.రెడ్డి వర్థంతి-1972)
ఒక్క ‘మాయాబజార్‌’ సినిమా చాలు... ఆ దర్శకుడి సృజనాత్మకత గురించి చెప్పడానికి! వెండితెర భాష తెలిసిన దర్శకుడాయన. ఒక షాటు, ఒక దృశ్యం, ఒక సన్నివేశం... ఇలా ఒక సినిమాలో ఏ అంశాన్ని చూసినా కె.వి.రెడ్డి ముద్ర ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కె.వి.రెడ్డి చిత్రీకరణ విధానాలు ఈనాటికీ సినీ దర్శకులకు నిత్య పాఠ్యాంశాలు. పోతన, యోగి వేమన, గుణసుందరి కథ, పాతాళభైరవి, పెద్దమనుషులు... ఇలా ఆయన తీసిన సినిమాలన్నీ నాటికీ, నేటికీ, ఏనాటికీ సినీజన మనో రంజితాలే! చిత్రసీమ చరిత్రలో చిరస్మరణీయాలే!!

* ఎన్టీఆర్‌ పేరు పెట్టారు! (అశ్వనీదత్‌ పుట్టిన రోజు)
తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతంగా కొనసాగుతున్న అగ్ర నిర్మాతల్లో ఒకరు సి.అశ్వనీదత్‌. వైజయంతీ మూవీస్‌ అధినేత అయిన ఆయన ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, కృష్ణంరాజు వంటి అగ్ర కథానాయకులతో పాటు, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ వంటి యువ కథానాయకులతోనూ సినిమాలు తీస్తూ విజయాల్ని సొంతం చేసుకొంటున్నారు. వైజయంతీ మూవీస్‌ని ఓ బ్రాండ్‌గా తీర్చిదిద్దిన ఘనత అశ్వనీదత్‌ది. ఎన్టీఆర్‌ స్వయంగా ఈ సంస్థకి పేరు పెట్టారు. అందుకే లోగోలో కూడా కృష్ణుడిగా శంఖం ఊదుతూ కనిపించే ఎన్టీఆర్‌ చిత్రం కనిపిస్తుంది. ‘ఓ సీత కథ’తో ప్రయాణం మొదలుపెట్టిన సి.అశ్వనీదత్‌ అగ్నిపోరాటం, జగదేగవీరుడు అతిలోక సుందరి, ఇంద్ర వంటి ఘన విజయాలతో సత్తా చాటారు. హిందీ, తమిళ భాషల్లోనూ పలు చిత్రాలు నిర్మించారు. ఇటీవలే ఆయన సంస్థ నుంచి వచ్చిన ‘మహానటి’ సంచలన విజయాన్ని సొంతం చేసుకొంది. ప్రస్తుతం మహేష్‌బాబు కథానాయకుడిగా దిల్‌రాజుతో కలిసి ‘మహర్షి’ నిర్మిస్తున్నారు. నాగార్జున, నాని కథానాయకులుగా ‘దేవదాస్‌’ నిర్మిస్తున్నారు. అశ్వనీదత్‌ కూతుళ్లయిన స్వప్నదత్‌, ప్రియాంకదత్‌ సంస్థ బాధ్యతల్ని భుజాన వేసుకొని తండ్రికి విజయాల్ని చేకూరుస్తున్నారు. 45 యేళ్లుగా తిరుగులేని నిర్మాతగా కొనసాగుతున్న అశ్వనీదత్‌ పుట్టినరోజు ఈ రోజు.
* మమతల తల్లి (రమ్యకృష్ణ పుట్టిన రోజు)
రమ్యకృష్ణ ఎక్కడికి వెళ్లినా భారతదేశం మొత్తం కళ్లప్పగించి చూస్తోందని ఇటీవలే నాగార్జున ‘శైలజారెడ్డి అల్లుడు’ వేడుకలో చెప్పారు. అది అక్షరాలా నిజం. ‘బాహుబలి’ చిత్రాలతో ఆమె పేరు జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. శివగామిగా ఆమె ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. మమతల తల్లిగా ఆ పాత్రలో ఒదిగిపోయిన విధానం చూసి నవతరం ప్రేక్షకులు కూడా ఆమెకి అభిమానులుగా మారిపోయారు. తెలుగుతో పాటు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 200కిపైగా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకొన్నారు రమ్యకృష్ణ. తొలినాళ్లలో కథానాయికగా నటించి, వెండితెరకు కమర్షియాలిటీని అద్దిన ఘనత ఆమెది. అదంతా ఒకెత్తైతే, ‘నరసింహ’లో ఆమె అభినయం మరో ఎత్తు. కథానాయకుడికే సవాల్‌ విసిరేంత బలమైన మహిళ పాత్రలో ఆమె కనిపించి అదరగొట్టింది. అది మొదలు ఆమె అభినయం ఏటికేడు కొత్త కోణంలో తెరపై ఆవిష్కృతమవుతూనే ఉంది. ‘బాహుబలి’ చిత్రాల తర్వాత మరోసారి ‘శైలజారెడ్డి అల్లుడు’లో శైలజారెడ్డిగా నటించి ప్రేక్షకుల మనసు దోచుకొన్నారు రమ్యకృష్ణ. 1967 సెప్టెంబరు 15న మద్రాసులో జన్మించారు రమ్యకృష్ణ. ప్రముఖ హాస్యనటుడు, పాత్రికేయుడు చో రామస్వామి మేనకోడలు అయిన రమ్యకృష్ణ భరతనాట్యంలోనూ, పాశ్చాత్య, కూచిపూడి నృత్యంలోనూ ప్రావీణ్యం సంపాదించి పలు ప్రదర్శనలు ఇచ్చారు. 14 యేళ్ల వయసులోనే సినీ ప్రయాణాన్ని ఆరంభించారు. 1984లో తమిళ చిత్రం ‘వెల్లై మనసు’లో వై.జి.మహేంద్ర సరసన నటించి ప్రేక్షకుల్ని అలరించారు. తెలుగులో ‘భలే మిత్రులు’ చిత్రంతో పరిచయమయ్యారు. కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘సూత్రధారులు’లో నటించి మంచి పేరు తెచ్చుకొన్నారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ తదితర అగ్ర కథానాయకులతో కలిసి నటించి స్టార్‌ కథానాయికగా ఓ వెలుగు వెలిగారు. తమిళంలోనూ ఆమె స్టార్‌గా గుర్తింపు తెచ్చుకొన్నారు. హిందీలో ‘బడే మియాన్‌ చోటే మియాన్‌’తో పాటు, పలు చిత్రాలు చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కొనసాగుతున్న ఆమె, బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. 2003లో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకొన్నారు. ఈ దంపతులకి రిత్విక్‌ అనే ఓ అబ్బాయి ఉన్నారు. ఈరోజు రమ్యకృష్ణ పుట్టినరోజు.

* ఏడు గుణాలు... ఏడు హత్యలు!
హిందూ మతం ‘అరిషడ్వర్గాలు’ అని ఆరు దుర్గుణాలను పేర్కొంటే, క్రీస్తుమతం ‘సెవెన్‌ సిన్స్‌’ అని ఏడు పాపాల గురించి చెబుతుంది. కామ, క్రోథ, లోభ, మోహ, మద, మాత్సర్యాల లాంటి ఏడు దుర్గుణాలను ఆలంబనగా చేసుకుని ఓ వ్యక్తి ఏడు హత్యలు చేసాడు. ఈ కేసును ఛేదించి, హంతకుడిని పట్టుకోడానికి డిటెక్టివ్‌ బరిలోకి దిగుతాడు. ఈ కథతో రూపొందిన చిత్రమే ‘సెవెన్‌’. 1995 సెప్టెంబర్‌ 15న న్యూయార్క్‌లో తొలి ప్రదర్శన జరిగిన ఈ సినిమాలో హాలీవుడ్‌ ప్రముఖులు మోర్గాన్‌ ఫ్రీమన్‌, కెవిన్‌ స్పేసీ, బ్రాడ్‌పిట్‌ నటించారు. డేవిడ్‌ ఫించర్‌ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్‌ సినిమాను 33 మిలియన్‌ డాలర్లతో తీస్తే, ప్రపంచవ్యాప్తంగా 327 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ‘సెవెన్‌’ సినిమా ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన ఏడో సినిమాగా నిలవడం విశేషం. తెలుగులో వచ్చిన ‘అపరిచితుడు’ సినిమాలోలాగే ఇందులో హంతకుడు ఏడు దుర్గుణాల ఆధారంగా ఆకర్షించి హత్య చేయడం ఆసక్తికరం.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.