సెప్టెంబర్‌ 26.. (సినీ చరిత్రలో ఈరోజు)
* దొంగా పోలీస్‌... చెలగాటం!
ఓ నగరంలో పథకం ప్రకారం నేరాలకు పాల్పడే దొంగల ముఠా. వారిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలు. ఆ దొంగల ముఠా నాయకుడు తనకు నమ్మకమైన ఓ యువకుడిని రహస్యంగా పోలీసు ఉద్యోగానికి పంపిస్తాడు, పోలీసుల ఎత్తుగడలు ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి. ఈ లోగా పోలీసులు ఓ కత్తిలాంటి పోలీసు కుర్రాడిని దొంగల ముఠాలోకి పంపుతారు, వాళ్ల పథకాలేంటో తెలుసుకోడానికి. అంటే పోలీసుల్లో రహస్య దొంగలా ఒకడుంటే, దొంగల్లో రహస్య పోలీసు ఒకడున్నాడన్నమాట. ఇంకేముంది? దొంగా పోలీసుల చెలగాటం మొదలవుతుంది. తమలో ఒకడు మారువేషంలో ఉన్నాడని ఇటు పోలీసులకి, అటు దొంగల ముఠాకి కూడా తెలుస్తుంది. వాడెవడో తెలుసుకునే బాధ్యతను మళ్లీ తాము నమ్మిన వ్యక్తులకే అప్పగిస్తారు. చివరకి ఈ దొంగపోలీస్, పోలీసుదొంగలు ఎలా బయటపడ్డారనేదే కథ. ఇలాంటి కథ దొరికితే సినిమాకి ఇంకేం కావాలి? అందుకే ‘ద డిపార్టెడ్‌’ సినిమా దుమ్ము దులిపేసింది. టైటానిక్‌ హీరో లియొనార్డో డికాప్రియో, మట్‌ డామన్, జాక్‌ నికల్సన్, మార్క్‌ వాల్‌బెర్గ్‌ లాంటి హేమాహేమీలు నటించిన ఈ సినిమాను 90 మిలియన్‌ డాలర్లతో తీస్తే ప్రపంచవ్యాప్తంగా 291 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది. 2006 సెప్టెంబర్‌ 26న విడుదలైన ఈ సినిమా నాలుగు ఆస్కార్‌ అవార్డులతో పాటు మరెన్నో అవార్డులను కొల్లగొట్టింది.

* అందం... గానం... అభినయం... మానవత్వం!
ఆమె పొందిన అవార్డులు, పురస్కారాలు రాయాలంటే ఓ పెద్ద జాబితా తయారవుతుంది. బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి ‘ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌’, ‘ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా’, ‘హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌’, ‘యునైటెడ్‌ నేషన్స్‌ అంబాసిడర్‌’, ‘వరల్డ్‌ హ్యుమానిటేరియన్‌ అవార్డ్‌’, ‘ఉమన్‌ ఆఫ్‌ ద 21 సెంచురీ’, ‘నేషనల్‌ లివింగ్‌ ట్రెజర్‌’లతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా మ్యూజిక్‌ అవార్డులు...ఎమ్మీ అవార్డులు... గ్రామీ అవార్డులు... అబ్బో... ఇలా చాలానే చెప్పుకోవల్సి ఉంటుంది. అందం, అభినయం, గానం, చలాకీతనంతో పాటు మానవత్వం ఉన్న అభినేత్రి ఆమె. పేరు ఒలీవియా న్యూటన్‌ జాన్‌. గాయనిగా ఆమె పాడిన పాటలు 100 మిలియన్లకు పైగా అమ్ముడయ్యాయి. ప్రముఖ నటుడు జాన్‌ ట్రవోల్టాతో కలిసి నటించిన సంగీత, శృంగారభరిత చిత్రం ‘గ్రీజ్‌’ ఆమె పేరును ప్రపంచం మార్మోగేలా చేసింది. పర్యావరణ ప్రేమికురాలిగా, జంతువుల హక్కుల ఉద్యమకారిణిగా, ఆరోగ్య ప్రచారకర్తగా, వితరణ శీలిగా ఆమెది మరో కోణం. భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి అందుకున్న శాస్త్రవేత్త మాక్స్‌ బోర్న్‌ మనవరాలు. ఇంగ్లండ్‌లో 1948 సెప్టెంబర్‌ 26న పుట్టిన న్యూటన్‌జాన్, ‘టుమారో’, ‘టు ఆఫ్‌ ఎ కైండ్‌’, ‘షీ ఈజ్‌ హేవింగ్‌ ఎ బేబీ’, ‘ఇట్స్‌ మై పార్టీ’ లాంటి సినిమాలతో మంచి నటిగా నిరూపించుకుంది. టీవీల్లో కూడా ఎన్నో కార్యక్రమాల్లో మెరిసింది.

* టెర్మినేటర్‌ నటి!
‘టెర్మినేటర్‌’ సినిమాలో భవిష్యతు కాలం నుంచి వర్తమానంలోకి వచ్చిన హ్యుమనాయిడ్‌ రోబో చంపడానికి తరుముతుంటే, సాహసోపేతంగా తప్పించుకునే సారా కానర్‌ పాత్ర గుర్తుందా? ఆ పాత్రతో అందరినీ ఆకట్టుకున్న నటి లిండా కారోల్‌ హామిల్టన్‌. ఈ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖురాలైపోయిన లిండా హామిల్టన్‌ అమెరికన్‌ నటి. ‘బ్యూటీ అండ్‌ ద బీస్ట్‌’ టెలివిజన్‌ సిరీస్‌ ద్వారా గోల్డెన్‌గ్లోబ్, ఎమ్మీ అవార్డులను నామినేషన్లు పొందింది. ‘చిల్డ్రన్‌ ఆఫ్‌ ద కార్న్‌’, ‘చుక్‌’, ‘మిస్టర్‌ డెస్టినీ’, ‘బ్లాక్‌ మూన్‌ రైజింగ్‌’, ‘కింగ్‌కాంగ్‌ లివ్స్‌’ లాంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ఇవాళ ఆమె పుట్టినరోజు.

* యువతరం గుండె చప్పుడు! (దేవానంద్‌ జయంతి-1923)
అందం అతడి ఇంటిపేరైతే, స్టైల్‌ అతడి ముద్దుపేరు. ఇక అతడి చిరునామా యువతరం గుండె చప్పుళ్లే! అతడే ధరమ్‌ దేవదత్‌ పిషోరిమల్‌ ఆనంద్‌. ఎవరో... అనుకోనక్కర్లేదు. బాలీవుడ్‌ లెజెండ్‌ దేవానంద్‌. నటుడు, నిర్మాత, దర్శకుడుగా అతడు ఏ పనిలో నిమగ్నమైనా అది దేశవిదేశాల యువతరానికి అభిమానపాత్రమైంది. కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సినిమాలకు అతడు కేంద్రబిందువు. ఈ అందగాడు అలవోకగా నవ్వినా, తల ఒకవైపు వంచి ఊపినా, స్టైల్‌గా నడిచినా, చిలిపి కళ్లతో చూసినా, వినూత్నంగా డైలాగ్‌ పలికినా యువతరం చప్పట్లు కొట్టింది, మురిసిపోయింది, అనుకరించింది, ఆరాధించింది!Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.