సెప్టెంబర్‌ 3.. (సినీ చరిత్రలో ఈరోజు)
* తెలుగు నాట పుట్టి.. బాలీవుడ్‌లో మెరిసి! (వివేక్‌ ఒబెరాయ్‌ పుట్టినరోజు 1976)

తండ్రి పంజాబీ.. తల్లి మదరాసి.. కానీ, అతను మాత్రం హైదరాబాదీనే. తెలుగు నాట పుట్టి.. తెలుగు నేలపై పెరిగి బాలీవుడ్‌లో జెండా పాతాడు. వెండితెరపై మెరిసిన తొలి చిత్రంతోనే ఉత్తమ నూతన నటుడిగా.. ఉత్తమ సహాయ నటుడిగా రెండు ఫిల్మ్‌ఫేర్‌లను కైవసం చేసుకోని సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించాడు. కేవలం నటుడిగానే కాక, నిర్మాతగా, స్క్రిప్ట్‌ రైటర్‌గా, టీవీ వ్యాఖ్యాతగా అన్నిటికీ మించి మంచి మనసున్న మనిషిగా విభిన్న రంగాల్లో గుర్తింపు పొందాడు. ఈ అరుదైన నటుడు మరెవరో కాదు వివేక్‌ ఒబెరాయ్‌. వివేక్‌.. 1976 సెప్టెంబరు 3న బాలీవుడ్‌ నటుడు సురేష్‌ ఒబెరాయ్‌, యశోధర దంపతులకు హైదరాబాద్‌లో జన్మించాడు. చిన్నతనం వరకు హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లోనే చదువుకున్న వివేక్‌.. తర్వాత అజ్మేర్‌లోని మయో కళాశాలలో, అక్కడి నుంచి జుహులోని మితిబాయ్‌ కాలేజిలో చదువు కొనసాగించాడు. ఈ సమయంలోనే లండన్‌లో జరిగిన ఓ యాక్టర్స్‌ వర్క్‌ షాప్‌కు వివేక్‌ హాజరవగా.. అతనిలోని ప్రతిభను గుర్తించిన ఓ దర్శకుడు అతన్ని న్యూయార్క్‌ తీసుకువెళ్లి ఫిలిం నటనలో మాస్టర్‌ డిగ్రీలో చేర్పించారు. అక్కడే నటనలో రాటుదేలిన వివేక్‌ ఒబెరాయ్‌ 2002లో రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘కంపెనీ’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఈ సినిమాలో చంద్రకాంత్‌గా వివేక్‌ నటనకు సినీప్రియులు, విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు రెండు ఫిలిం ఫేర్‌ అవార్డులను అందుకున్నాడు. కానీ, దీని తర్వాత చేసిన ‘రోడ్‌’, ‘దమ్‌’ చిత్రాలు కమర్షియల్‌గా హిట్‌ అవకపోయినా నటుడిగా వివేక్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక 2002లో షాహీద్‌ అలీ దర్శకత్వంలో వచ్చిన ‘సాతియా’.. వివేక్‌ ఒబెరాయ్‌కి కథానాయకుడిగా తొలి విజయాన్ని అందించింది. అయితే తన సినీ కెరీర్‌లో సోలో కథానాయకుడిగా కన్నా మల్టీస్టారర్‌ నటుడిగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘మస్తీ’, ‘యువ’, ‘ఓంకారా’, ‘గ్రాండ్‌ మస్తీ’ వంటి చిత్రాలు వివేక్‌కు బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చిపెట్టాయి. హృతిక్‌ రోషన్‌ నటించిన ‘క్రిష్‌ 3’ కోసం తొలిసారిగా ప్రతినాయకుడిగా తెరపై మెరిశాడు. ఇక జీవితగాథలు ఆధారంగా తీసిన ‘షూట్‌ ఔట్‌ ఎట్‌ లోఖండ్‌ వాలా’, ‘రక్త చరిత్ర’, ‘రక్త చరిత్ర 2’, ‘రాయ్‌’ వంటి సినిమాలు వివేక్‌ ఒబెరాయ్‌ను నటుడిగా మరో మెట్టు పైకెక్కించాయి. ముఖ్యంగా పరిటాల రవి జీవితాధారంగా వర్మ తెరకెక్కించిన ‘రక్త చరిత్ర’లో ప్రతాప్‌ రవిగా వివేక్‌ చూపిన నటన విమర్శకులను సైతం మెప్పించింది. ఇది వివేక్‌కు తెలుగులో తొలి చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం రామ్‌చరణ్‌ కథానాయకుడి గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో మరోసారి ప్రతినాయకుడిగా తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. నిర్మాతగా వివేక్‌ తెరకెక్కించిన ‘వాచ్‌ ఇండియా సర్కస్‌’ బూసన్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమవడమే కాక.. ఉత్తమ సినిమాగా ఆడియన్స్‌ చాయిస్‌ అవార్డును అందుకోవడం ఓ విశేషం. అంతేకాదు ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగానూ రికార్డు సాధించింది. వివేక్‌ ఒబెరాయ్‌కు నటుడిగానే కాక మంచి సేవా గుణమున్న వ్యక్తిగానూ గుర్తింపు ఉంది. 2004 సునామీ బాధితుల కోసం ప్రాజెక్టు హోప్‌తో కలిసి పనిచేసిన వివేక్‌.. ఆ సునామీలో కొట్టుకుపోయిన ఓ ఊరును దత్తత తీసుకోని దాన్ని పునర్నిర్మానానికి ఎంతో కృషి చేశాడు. వివేక్‌ చేసిన ఈ సేవలకు గానూ ‘రెడ్‌ అండ్‌ వైట్‌ బ్రేవరీ’ అవార్డుతో పాటు ‘రోటరీ ఇంటర్నేషనల్‌ నుంచి గుడ్‌ సమరిటన్‌’ పురస్కారాలు అందుకోవడం గర్వించదగ్గ అంశం. అంతేకాదు నటి కరీనా కపూర్‌ స్ఫూర్తితో శాకాహారిగా మారిన వివేక్‌.. తర్వాత కొన్నాళ్లకు పెటా సంస్థ విడుదల చేసిన సెక్సీయెస్ట్‌ వెజిటేరియన్‌ జాబితాలోనూ చోటు సంపాదించుకున్నాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తరపున పొగాకు వ్యతిరేక ప్రచారానికి అంబాసిడర్‌గానూ పనిచేశాడు వివేక్‌ ఒబెరాయ్‌. అప్పట్లో కొన్నాళ్లు నటి ఐశ్వర్య రాయ్‌తో వివేక్‌ ప్రేమాయణం నడిపాడని వార్తలొచ్చాయి. ఈ బంధం విడిపోయాక.. 2010 అక్టోబరు 29న కర్ణాటకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి కుమార్తె ప్రియాంజా అల్వాను వివేక్‌ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరికీ ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ రోజు వివేక్‌ ఒబెరాయ్‌ పుట్టిన రోజు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.