సెప్టెంబర్‌ 2.. (సినీ చరిత్రలో ఈరోజు)
* వేడుక వద్దని... వేదన మిగిల్చి! (నందమూరి హరికృష్ణ జయంతి-1956)


‘నా పుట్టిన రోజు వేడుకల్ని జరపకండి. అందుకయ్యే ఖర్చును కేరళ బాధితులకు విరాళంగా ఇవ్వండి...’ అంటూ అభిమానులకు, కార్యకర్తలకు బహిరంగ లేఖ రాసిన నందమూరి హరికృష్ణ దృక్పథం... ఇప్పుడు ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది. ‘జనం కోసం మనం’ అనే ఆదర్శాన్ని ఆచరించిన ఓ సహృదయం... ఇప్పుడు గతంలోకి జారిపోయింది. ఆ లేఖలోని ఆయన అక్షరాలు అలాగే ఉన్నాయి... ఆయన సంతకం అలాగే ఉంది. ఆయన మాత్రం లేరు. మూడు రోజుల క్రితం సజీవంగా ఉన్న ఓ చైతన్యం... నేడు అభిమానుల గుండెల్లో విషాదమై నిలిచింది. నేడు అభిమానుల నుంచి శుభాకాంక్షలు అందుకోవలసిన ఆయన, బాధాతప్త హృదయాల నివాళులు అందుకుంటున్నారు. ఓ పుట్టిన రోజు... జయంతిగా మారిపోయిన వేళ... నందమూరి హరికృష్ణ జ్ఞాపకాలను మరోసారి మననం చేసుకుందాం.
 
* పవర్‌ ఉన్న స్టార్‌! (పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు-1972)

స్టార్‌ అనే మాటకి ఉన్న బలం ఏంటో... మాస్‌ ఇమేజ్‌ అంటే ఎలా ఉంటుందో పవన్‌కల్యాణ్‌ కెరీర్‌ని, ఆయనకి ప్రేక్షకుల్లో ఉన్న అభిమానాన్ని చూస్తే అర్థమవుతుంది. ఆయన్నుంచి ఒక ఫ్లాప్‌ సినిమా వచ్చినా సరే రూ: 80 కోట్లు వసూళ్లొస్తాయి. ఆయన బయటికొస్తున్నారని తెలిస్తే చాలు... లక్షల మంది వెంట నడుస్తారు. ఆయన ఆలోచనలు ఇజంగా మారాయి. పవనిజం అంటూ ఆ ఆలోచనల్ని అనుసరిస్తుంటారు అభిమానులు.


 ప్రముఖ కథానాయకుడు చిరంజీవి తమ్ముడు పవన్‌కల్యాణ్‌. అన్న చాటు తమ్ముడిగానే పరిశ్రమకి పరిచయమయ్యాడు. కానీ ఇంతింతై అన్నట్టుగా ఒకొక్క అడుగు ముందుకేస్తూ ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. ఆయన ఇమేజ్‌ ఎవరెస్టు శిఖరం. ఆయన్ని కథానాయకుడిగా ఎంత మంది అభిమానిస్తారో... వ్యక్తిగా అంతకంటే ఎక్కువగా ఆరాధిస్తారు. చాలా తక్కువమంది కథానాయకులు అలాంటి ఇమేజ్‌తో కనిపిస్తుంటారు. అదంతా గాలివాటంతో వచ్చిన గుర్తింపేమీ కాదు. ఆయనలో ఓ మంచి ప్రతిభావంతుడు ఉన్నాడు. కథానాయకుడిగానే కాకుండా... నిర్మాతగా, యుద్ధ కళాప్రావీణ్యుడు, దర్శకుడిగా, రచయితగా, రాజకీయవేత్తగా ఆయన రాణిస్తున్నారు. కొణిదెల వెంకటరావు, అంజనా దేవి దంపతులకు, 1972 సెప్టెంబరు 2న బాపట్లలో జన్మించారు పవన్‌. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. పెద్దన్నయ్య చిరంజీవి కాగా, నటుడు మరియు నిర్మాత అయిన కొణిదెల నాగేంద్ర బాబు పవన్‌కు రెండో అన్నయ్య. ఇంటర్‌ మీడియట్‌ నెల్లూరు లోని వి.ఆర్‌.సి కళాశాలలో పూర్తి చేసాడు. పిమ్మట కంప్యూటర్స్‌లో డిప్లోమా చేశారు. సినిమా అంటే పెద్దగా ఆసక్తి లేని పవన్‌కల్యాణ్‌ తన అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. అయితే స్వతహాగా సిగ్గరి కావడంతో తెర ప్రవేశం చేయడానికి చాలా ఆలోచించారు. కానీ తన వదిన, చిరంజీవి సతీమణి అయిన సురేఖ ప్రోద్భలంతో కథానాయకుడిగా తెరప్రవేశం చేశారు. 1996లో విడుదలైన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ పవన్‌ తొలి చిత్రం. ఆ చిత్రం అంతంత మాత్రంగానే ఆడినప్పటికీ పవన్‌కల్యాణ్‌ మాత్రం ప్రేక్షకులకు బాగా నచ్చాడు. ముఖ్యంగా ఆయన ప్రదర్శించిన యుద్ధవిద్యలు, సాహపోతమైన విన్యాసాలు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి. స్వతహాగా మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదించిన ఆయన సొంతంగా, డూప్‌ లేకుండా ఫైట్లు చేయడానికి ఇష్టపడతారు. కొన్ని చిత్రాలకి సొంతంగానే పోరాట ఘట్టాల్ని కంపోజ్‌ చేసుకుంటుంటారు. ‘గోకులంలో సీత’, ‘తొలి ప్రేమ’, ‘తమ్ముడు’, ‘సుస్వాగతం’, ‘బద్రి’, ‘ఖుషి’ చిత్రాలతో ఆయన రేంజ్‌ పెరిగిపోయింది. ప్రేక్షకుల్లో ఆయనకి చెప్పలేనంత ఇమేజ్‌ పెరిగింది. ‘జల్సా’, ‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రాలతో ఆయన రికార్డులు సృష్టించారు. ‘అత్తారింటికి దారేది’ చిత్రం వసూళ్ళలో అప్పటి వరకు తెలుగు సినీపరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ‘గోపాల గోపాల’ చిత్రంలో మోడరన్‌ కృష్ణుడిగా నటించి అదరగొట్టారు. ‘జానీ’తో దర్శకుడిగా కూడా మారారు. నిర్మాణంలోనూ ఆయనకి పట్టుంది. పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై ‘గబ్బర్‌సింగ్‌’, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రాలు చేశారు. అతి పిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కథానాయకులలో పవన్‌ కళ్యాణ్‌ ఒకరు. అలాగే తన చిత్రాలకి, అన్న చిరంజీవి నటించిన చాలా చిత్రాలకు పవన్‌ కల్యాణ్‌ ఫైట్లని రూపొందించారు. తమ్ముడు చిత్రంలో లుక్‌ ఎట్‌ మై ఫేస్‌ ఇన్‌ ద మిర్రర్‌ పాటను పూర్తి నిడివి ఆంగ్ల గీతంగా రూపొందించారు. ‘బద్రి’ చిత్రంలో మేరా దేశ్‌ హై ప్యారా ప్యారా తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ మేళవింపుగా త్రిభాషా గీతంగా, ‘ఖుషి’లో యే మేరా జహాన్‌ గీతాన్ని పూర్తిస్థాయి హిందీ గీతంగా రూపొందించారు. ఇవన్నీ కూడా పవన్‌కల్యాణ్‌ ఆలోచనల మేరకు రూపుదిద్దుకొన్నవే. ‘ఖుషి’ చిత్రంలో ఆడువారి మాటలకు అర్థాలే వేరులే..., ‘జానీ’ చిత్రంలో ఈ రేయి తీయనిదీ... పాటలని రీ-మిక్స్‌ చేయించారు. సంగీతంలో మంచి అభిరుచిని ప్రదర్శిస్తుంటారు పవన్‌. ‘అత్తారింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’ చిత్రాలలో పాటల్ని కూడా ఆలపించారు. పవన్‌ కల్యాణ్‌ తన చిత్రాలలో కనీసం ఒక్క జానపద గీతమైనా ఉండేలా ప్రయత్నాలు చేస్తుంటారు.


 కథానాయకుడిగా 25 చిత్రాలు చేసిన, మాస్‌ ప్రేక్షకుల్లో మంచి అభిమానాన్ని సంపాదించిన పవన్‌కల్యాణ్‌ 2014 మార్చి 14 న జనసేన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ జరిపారు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తెలిపాడు. 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేశారు. జనసేన పార్టీతో మరోసారి రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ 2014 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, కేంద్రంలో మోదీకి మద్దతు పలికారు. తనతో కలిసి ‘బద్రి’, ‘జానీ’ చిత్రాల్లో నటించిన రేణూ దేశాయ్‌ని 2009 జనవరి 28 న వివాహం చేసుకున్నారు పవన్‌కల్యాణ్‌. వీరిద్దరి సంతానం... అకీరానందన్‌, ఆద్య. ప్రఖ్యాత జపనీస్‌ దర్శకుడు అకీరా కురొసావాపై అభిమానంతో వారు కొడుకుకు అకీరా అని పేరు పెట్టుకున్నారు. పవన్‌, రేణుల వివాహ బంధం విచ్చిన్నం అయింది. 2013 సెప్టెంబరు 30న అన్నా లెజ్‌నోవాని వివాహం చేసుకున్నారు పవన్‌. వీరిద్దరికి మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ అనే బాబుతోపాటు, పొలెనా అంజనా పవనోవా అనే అమ్మాయి ఉన్నారు. ప్రస్తుతం 2019లో జరిగే ఎన్నికలపైనే దృష్టి కేంద్రీకరించి, జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు పవన్‌. ఎన్నికల తర్వాతే ఆయన సినిమా కెరీర్‌ని కొనసాగించడంపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఈ రోజు పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు. వీడు ఆరడుల బుల్లెట్టూ.. ధైర్యం విసిరిన రాకెట్టూ అనే పాటకి తగ్గట్టుగానే ఉంటుంది పవన్‌కల్యాణ్‌ ఆలోచనలు. ఎవరికీ భయపడకుండా, నిజాయతీగా వేసే ఆయన అడుగులు యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.

* బాలీవుడ్‌ తెరపై అందాల సంతకం! (నటి సాధన జయంతి-1941)

ఆమె తలకట్టు అప్పట్లో యువతులను ఉర్రూతలూగించింది. ఆమె దుస్తులు ఓ కొత్త ఫ్యాషన్‌కు తెర తీశాయి. ఆమే అందాల తార సాధన. బాలీవుడ్‌ చిత్రాల్లో ముగ్దమనోహర రూపంతో అలరించిన సాధన సంగతులేంటి? ఆమె ప్రస్థానంలో ఆకట్టుకునే విశేషాలు ఏంటి?

* బ్రిటిష్‌ చిత్రాల్లో మేటి!

బ్రిటిష్‌ చిత్రాలన్నింటిలో గొప్పదిగా ఓ సినిమా పేరు తెచ్చుకుంది. అదే ‘ద థర్డ్‌ మ్యాన్‌’. క్రైమ్‌ డ్రామాగా తీసిన ఈ సినిమాను తీసిన విధానంపై పుస్తకాలు కూడా వచ్చాయి. చిత్రీకరణలో వాడిన లైటింగ్‌, స్క్రీన్‌ప్లే తీరుతెన్నులు, నటీనటుల అభినయం, ‘డచ్‌యాంగిల్‌’ అనే కెమేరా టెక్నిక్‌, నేపథ్య సంగీతం అన్నీ విమర్శకుల ప్రశంసలు పొందాయి.

* యాక్షన్‌ థ్రిల్లర్‌ నటుడు!

ప్రపంచంలోని అందాల నటుల్లో ఒకడు... వందమంది మేటి నటుల్లో ఒకడు... ఇవి అంతర్జాతీయంగా అతడు సంపాదించుకున్న గుర్తింపులు. ఆ నటుడెవరో తెలియాలంటే ‘స్పీడ్‌’ సినిమాలను గుర్తుకు తెచ్చుకుంటే చాలు. యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాల ద్వారా ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న అతడే... కియాను ఛార్లెస్‌ రీవ్స్‌. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, సంగీత కళాకారుడిగా బహుముఖంగా ఎదిగిన ఇతడు 1964 సెప్టెంబర్‌ 1న పుట్టాడు. ‘పాయింట్‌ బ్రేక్‌’, ‘ద డెవిల్స్‌ అడ్వొకేట్‌’, ‘కాన్‌స్టాన్‌టైన్‌’, ‘ద మ్యాట్రిక్స్‌’, ‘లిటిల్‌ బుద్ధ’ లాంటి చిత్రాల ద్వారా ఆకట్టుకున్నాడు. గిటార్‌ వాయిద్యకారుడిగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు.
* అందచందాల నటి!

‘ప్రపంచంలోని 50 మంది అందాల వ్యక్తుల్లో ఒకరు’గా ఆమెకు గుర్తింపు ఉంది.
‘ప్రపంచంలోని 100 మంది సెక్సీయస్ట్‌ ఉమన్‌’ జాబితాలో 8వ స్థానంలో నిలిచింది.
‘ప్రపంచంలోని 10 మంది స్టైలిష్‌ ఉమన్‌’గా బహమతి కూడా అందుకుంది.
-ఇన్ని ట్యాగ్‌లైన్స్‌ ఉన్న ఆ అందచందాల నటే సల్మా హయక్‌ పినౌట్‌. నటిగా, నిర్మాతగా, మోడల్‌గా పేరొందిన సల్మా హయక్‌, 1966 సెప్టెంబర్‌ 2న మెక్సిలో పుట్టి టీవీల ద్వారా పేరుతెచ్చుకుని వెండితెరపై మెరిసింది. ‘డెస్పరాండో’, ‘ఫ్రమ్‌ డస్క్‌ టిల్‌ డాన్‌’, ‘డాగ్మా’, ‘వైల్డ్‌ వైల్డ్‌ వెస్ట్‌’, ‘ఫ్రిడా’ లాంటి చిత్రాల ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.