మార్చి 12.. (సినీ చరిత్రలో ఈరోజు)

* మెలోడీ.. మాస్‌.. ఏదైనా! (శ్రేయా ఘోషల్‌- 1984)సంప్రదాయ సంగీతమైనా.. పాశ్చాత్య గీతమైనా... పేమ పాటలు, విరహగీతాలు, కవ్వించి కాలు కదిపించే ఐటెంగీతాలు.. ఏతరహా పాటలైనా ఆమె గళంలో పడితే ఆణిముత్యాలై ప్రేక్షకుల మదిలో నాటుకుపోవాల్సిందే. తనదైన వైవిధ్యమైన గానామృతానికి అన్ని వర్గాల ప్రేక్షకులు సాహో అనాల్సిందే. ఇలా హిందీ, తెలుగు, తమిళం అని భాషా భేదాలు లేకుండా కోట్లాది మంది సినీ సంగీత ప్రియుల హృదయాలను కొల్లకొట్టింది శ్రేయా ఘోషల్‌. మార్చి 12న ఆమె 35వ జన్మదినాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో ‘సితార.నెట్‌’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది...

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి..)

* భవిష్యత్‌లో భయంకరమైన ఆట సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా... పైగా భవిష్యత్తు కాలానికి సంబంధించింది... దానికి సాయం భయంకరమైన ఆట నేపథ్యంలో ఉత్కంఠభరితమైన కథనం... ఇన్ని చాలవూ సినిమా కాసులు కురిపించడానికి? అందుకే, ‘ద హంగర్‌ గేమ్స్‌’ సినిమా అంత పనీ చేసింది. అంతర్జాతీయంగా యువతకు ఆకట్టుకుంది. సుజానే కోలిన్స్‌ అనే రచయిత్రి రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమా కథ భవిష్యత్‌ కాలానికి చెందిన ఓ ఊహాజనిత ప్రాంతంలో జరుగుతుంది. ఆ దేశాన్ని పన్నెండు విభాగాలుగా విభజించి ప్రతి ఏటా ఒకో విభాగం నుంచి ఓ అమ్మాయిని, అబ్బాయిని ఎంపిక చేస్తారు. వారితో ఓ భయంకరమైన ఆట ఆడిస్తారు. ఆ ఆటలో విజయం సాధించాలంటే రెండో వాళ్లు మరణించాల్సిందే. ఆ ఆటను దేశ ప్రజలంతా టీవీల ద్వారా చూస్తుంటారు. ఈ సినిమా 2012లో విడుదలై, 78 మిలియన్‌ డాలర్ల పెట్టుబడకి ఏకంగా 694.4 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. అనేక అవార్డులు పొందింది. ఈ సినిమాను ఆ తర్వాత డీవీడీలు, బ్లూరేల ద్వారా విడుదల చేసినా రికార్డు అమ్మకాలు జరగడం విశేషం.

* క్యాబరే... నటి


ద్నాలుగు నెలల వయసులోనే సినిమాలో కనిపించింది. పదమూడేళ్ల వయసులో సినిమా అవకాశం పొందింది. తల్లి నటి. తండ్రి దర్శకుడు. ఇంకేం కావాలి, సినిమానే ఆమె జీవితం కావడానికి. అదే జరిగింది లిజా మిన్నెల్లి విషయంలో. అమ్మానాన్నా పని చేసుకుంటుంటే ఆమె చిన్నతనమంతా స్టూడియోల్లోనే జరిగింది. అలా ఎదిగిన ఆమె అంతర్జాతీయంగా ఎంత ప్రాచుర్యం పొందిందో తెలియాలంటే ‘క్యాబరే’ (1972) సినిమా చూడాలి. అందులో నటనకు ఆమె ఆస్కార్‌ మాత్రమే కాదు, ప్రపంచ సినీ ప్రేక్షకుల గుండెల్లో కొండంత అభిమానం కూడా పొందింది. నటిగానే కాదు, గాయనిగా కూడా ఆమె ఉర్రూతలూగించింది. డ్యాన్సర్‌గా ఈలలు వేయించింది. వేదికలు, టీవీల్లో మెరిసింది. ఏ రంగంలో పని చేసినా ఆ రంగంలో ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకుంది. ‘ద స్టెరైల్‌ కుకూ’, ‘లక్కీ లేడీ’, ‘న్యూయార్క్, నూయార్క్‌’, ‘రెంట్‌ ఎ కాప్‌’, ‘స్టెప్పింగ్‌ ఔట్‌’, ‘ఆర్తుర్‌’లాంటి సినిమాలు చూస్తే ఆమె అభినయాన్ని మెచ్చుకోకుండా ఉండలేరెవ్వరూ. లాస్‌ఎంజెలిస్‌లో 1946 మార్చి 12న పుట్టిన లిజా బహుముఖమైన ప్రతిభతో ముందుకు సాగుతోంది.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి..)


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.