జూన్‌ 1
* సంచలనాల తార..
అందాల నటిగా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన మార్లిన్‌ మాన్రో పుట్టింది ఈ రోజే (1926). లాస్‌ ఏంజెలిస్‌లో పుట్టిన మాన్రో మోడల్‌గా, గాయనిగా, నటిగానే కాక శృంగార తారగా అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. 1950, 60ల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ‘ప్లేబోయ్‌’ పత్రిక మొదటి పత్రికకకు మోడలింగ్‌ చేసి సంచలనం సృష్టించింది. అమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నడీని ఉద్దేశిస్తూ ఆమె పాడిన ‘హ్యాపీ బర్త్‌డే మిస్టర్‌ ప్రెసిడెంట్‌’ గీతం ఎనలేని ప్రజాదరణ పొందింది. అప్పట్లో అత్యధిక పారితోషికం ఈమెదే. చిన్న వయసులో అనూహ్యంగా చనిపోయేనాటికే ఆమె చిత్రాలు 200 మిలియన్‌ డాలర్లను వసూలు చేసి, ఆమెనో సంచలన తారగా మార్చాయి. బాల్యంలో అనాథలా పెరిగిన ఆమె ఆకర్షణీయ రూపం వల్ల మోడలింగ్‌లో అడుగుపెట్టింది. ఆమె అందం త్వరలోనే ‘ట్వంటీయత్‌ సెంచరీ ఫాక్స్‌’, ‘కొలంబో పిక్చర్స్‌’ సంస్థలను ఆకర్షించింది. ‘యాజ్‌ యంగ్‌ యాజ్‌ యు ఫీల్‌’, ‘మంకీ బిజినెస్‌’, ‘క్లాష్‌ బై నైట్‌’, ‘డోన్ట్‌ బాదర్‌ టు నాక్‌’, ‘హౌటు మ్యారీ ఎ మిలియనీర్‌’, ‘సెవెన్‌ ఇయర్స్‌ ఇచ్‌’ లాంటి చిత్రాలు ఆమంటే క్రేజ్‌ను సృష్టించాయి. నగ్నంగా ఫోజులిచ్చిందనే వివాదాలు కూడా ఆమెను చుట్టుముట్టాయి. ఉత్తమ నటిగా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు కూడా అందుకుంది. అయితే మరోవైపు ఆమె వ్యక్తిగత జీవితం ఒడిదుడుకుల పాలైంది. కుంగుబాటుతనంలో బాధపడింది. పదహారేళ్లకే ఓ పోలీస్‌ను పెళ్లి చేసుకున్న ఈమె తన 27 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుంది. ముఫ్పై ఏళ్ల వయసులో మూడో సారి పెళ్లి చేసుకుంది. ఈమె తన 36 ఏళ్ల వయసులో 1962 ఆగస్టు 5న ఆత్మహత్య చేసుకుని మరణించడం ఆమె అభిమానులను కలచివేసింది.* నవ్వుల మాధవన్‌...
బాలీవుడ్‌లో తన నవ్వుతోనే అందరిని ఆకట్టుకునే నటుడు మాధవన్‌ పుట్టిన రోజు (1970). కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, గాయకుడిగా ప్రేక్షకాదరణ పొందిన నటుడతడు. ఎక్కువగా ప్రేమ చిత్రాల్లో నటించి కుర్రకారు మదిలో స్థానం సంపాదించుకున్నాడు. అసలు పేరు మాధవన్‌ బాలాజీ రంగనాథన్‌. మాధవన్‌ హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, ఆంగ్లం, మలై వంటి పలు భాషాచిత్రాల్లో నటించాడు. తొలిసారిగా బాలీవుడ్‌లో ‘ఇస్‌ రాత్‌ కీ సుభా నాహిన్‌’ చిత్రంలో ఓ పాట పాడారు. తర్వాత ‘ఇన్‌ఫెర్నో’ అనే ఆంగ్ల సినిమాలో నటించాడు. కన్నడలో ‘శాంతి శాంతి శాంతి’లో హీరోగా నటించాడు. పరిశ్రమకు కొత్తగా వచ్చిన వెంటనే మూడు భాషల్లో అవకాశాలను అందుకున్న ఏకైక నటుడు మాధవన్‌ మాత్రమే. హిందీలో ‘3 ఇడియట్స్‌’తో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. ‘తనూ వెడ్స్‌ మనూ’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. హిందీ, తమిళంలో ఆయన నటించిన చాలా చిత్రాలు మంచి పేరు తెచ్చాయి. తెలుగులో ఆయన నటించిన సినిమాలు డబ్బింగయ్యాయి. అందులో ‘13బి’ అనే చిత్రంతో తెలుగువారికి పరిచయమయ్యాడు. ‘చెలి’తో మంచి రొమాంటిక్‌ హీరోగా అభిమానులకు గుర్తుండిపోయాడు. ఇక ‘సఖి’తో తెలుగులో తనదైన ముద్రవేశాడు. తాజాగా మొదటిసారిగా తెలుగు సినిమాలో తానే స్వయంగా నటించబోతున్నాడు. నాగచైతన్య నటిస్తున్న ‘సవ్యసాచి’లో ముఖ్యపాత్రలో అభిమానులకు కనిపించనున్నాడు.* వినోదాల శిల్పి
ఎస్‌.వి. కృష్ణారెడ్డి పుట్టిన రోజు. వినోదాత్మక చిత్రం అనే ప్రస్తావన వస్తే అది ఎస్‌.వి.కృష్ణారెడ్డి పేరు లేకుండా పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. 1990, 2000 దశకాల్లో ఆయన తీసిన చిత్రాలు సంచలనాలు సృష్టించాయి. యేడాదిపాటు ఆడిన చిత్రాలున్నాయి. స్వచ్ఛమైన హాస్యంతో, ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా చిత్రాల్ని తెరకెక్కించిన ఘనత ఎస్వీ కృష్ణారెడ్డి సొంతం. దర్శకుడిగానే ఆయన సుపరిచితమైనప్పటికీ.. తెలుగు చిత్రసీమకి నటుడిగా పరిచయమయ్యారు. 1976లో ‘పగడాల పడవ’ అనే చిత్రంలో నటించారు. చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘కిరాతకుడు’లో ఒక చిన్న పాత్ర చేశారు. సంగీతంలోనూ మంచి పట్టున్న ఎస్వీ కృష్ణారెడ్డి తాను దర్శకత్వం వహించిన పలు చిత్రాలకి స్వయంగా స్వరాలు సమకూర్చుకొన్నారు. హిందీలో ‘తక్‌దీర్‌వాలా’ తెరకెక్కించారు. ‘జుడాయి’కి కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చారు. ఆంగ్లంలో ‘డైవర్స్‌ ఇన్విటేషన్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.