అక్టోబర్‌ 19.. (సినీ చరిత్రలో ఈరోజు)

* డియోల్‌ వంశానికి ఆణిముత్యం!
(సన్నీ డియోల్‌ పుట్టిన రోజు-1956)


చిత్రసీమలో తల్లిదండ్రుల నట వారసత్వంతో వెండితెరపై మెరిసిన వారెందరో ఉన్నారు. కానీ, ఆ వారసత్వపు అండకు సొంత ప్రతిభ తోడు కాలేనప్పుడు కాల ప్రయాణంలో కనుమరుగు కాక తప్పదు. అలా తెర మరుగైన వారసులు చిత్ర పరిశ్రమలో కోకొల్లలు. సన్నీ డియోల్‌ కూడా తండ్రి ధర్మేంద్ర నట వారసత్వంతో వెండితెరపై దూకిన వాడే. కానీ, తొలి చిత్రంతోనే తనలోని ప్రతిభను బాలీవుడ్‌ బాక్సాఫీస్‌కు రుచి చూపించాడు. తాను తన తండ్రి పేరు, ప్రతిష్ఠల నీడలోనే కలకాలం బతికే వ్యక్తిని కాదని తొలి అడుగుతోనే తెలియజేశాడు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. డియోల్‌ వంశంలో మరో ఆణిముత్యమై మెరిశాడు సన్నీ డియోల్‌. దాదాపు 36 ఏళ్ల సినీ కెరీర్‌లో వందకు పైగా చిత్రాల్లో నటించడమే కాక దర్శకనిర్మాతగానూ మెప్పించాడు. ఉత్తమ నటుడిగా రెండు జాతీయ పురస్కారాలతో పాటు, రెండు ఫిలింఫేర్‌ అవార్డులను దక్కించుకున్నాడు. 1980 - 90ల కాలంలో యాక్షన్‌ హీరోగా ఓ వెలుగు వెలిగిన సన్నీ డియోల్‌.. తొలిసారిగా ‘బేతాబ్‌’ (1982) చిత్రంతో వెండితెరపై మెరిశాడు. ఈ చిత్రం కమర్షియల్‌గా పర్వాలేదనిపించినప్పటికీ, నటన పరంగా సన్నీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. తొలి సినిమాతోనే ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌కు నామినేషన్‌ దక్కించుకున్నాడు. ఇక ఇక్కడి నుంచి ‘మంజిల్‌ మంజిల్‌’, ‘అర్జున్‌’, ‘సుల్తానాథ్‌’, ‘డెకాయిట్‌’, ‘యతీమ్‌’ వంటి మెచ్చుకోదగ్గ చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్‌లో కథానాయకుడిగా స్థిరపడ్డాడు. ఈ యాక్షన్‌ నటుడు తన సోదరుడు బాబీడియోల్‌తో కలిసి నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తొలి చిత్రం ‘దిల్లగి’. ఈ చిత్రానికి బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితం ఎదురైనా.. సన్నీ ప్రయత్నం సినీప్రియులతో పాటు విమర్శకులను మెప్పించింది. ఇక సన్నీడియోల్‌ సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రాల్లో ముఖ్యంగా చెప్పుకోవల్సినవి ‘ఘాయల్‌’, ‘దామిని లైట్నింగ్‌’, ‘గదర్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’. 1990లో తన తండ్రి ధర్మేంద్ర నిర్మాణంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘ఘాయల్‌’తోనే సన్నీ ఉత్తమ నటుడిగా తొలి జాతీయ పురస్కారంతో పాటు తొలి ఫిలింఫేర్‌ను అందుకున్నాడు. రాజ్‌కుమార్‌ దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రమిది. అప్పటి వరకు సన్నీని యాక్షన్‌ చిత్రాల్లోనే చూసిన ప్రేక్షకులకు ఈ సినిమా ఓ సరికొత్త సన్నీ డియోల్‌ను పరిచయం చేసింది. కేవలం రూ.1.75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.19 కోట్ల వసూళ్లు సాధించి ఆ ఏడాది బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న రెండవ చిత్రంగా రికార్డు సృష్టించింది. పైగా వివిధ విభాగాల్లో 7 ఫిలింఫేర్‌లు దక్కడం విశేషం. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీకాంత్‌ కథానాయకుడిగా ‘గమ్యం’ పేరుతో పునర్నిర్మించారు. దీనికి సీక్వెల్‌గా 2016లో ‘ఘాయల్‌: వన్స్‌ ఎగైన్‌’ను తెరకెక్కించగా అది కూడా బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటింది. 1993లో సన్నీ డియోల్, రిషి కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘దామిని లైట్నింగ్‌’.. సన్నీలోని నటుడిని మరో కోణంలో ప్రేక్షకులకు పరిచయం చేసిందని చెప్పొచ్చు. న్యాయం కోసం సమాజంపై పోరాటం చేసే ఓ మహిళ కథగా రూపొందిన ఇందులో సన్నీ న్యాయవాదిగా అత్యద్భుతమైన నటనను కనబర్చి విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచాడు. ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డుతో పాటు మరో ఫిలింఫేర్‌ పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకొన్నాడు. ఇక ఇవన్నీ ఒకెత్తయితే 2001లో వచ్చిన ‘గదర్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’ మరొకెత్తు. ఈ చారిత్రక ప్రేమకథలో అమీషాతో జºడీ కట్టిన సన్నీ డియోల్‌ వహ్‌వా అనిపించే అభినయంతో బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించాడు. తన సినీ కెరీర్‌లోనే కాక బాలీవుడ్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌- 3 చిత్రాల్లో ఒకటిగా స్థానం సంపాదించిందీ చిత్రం. ‘వీర్తా’, ‘ఇంతిహాన్‌’, ‘సలాఖేన్‌’, ‘ఫార్జ్‌’, ‘అప్నే’, ‘యమ్లా పాగల్‌’ ‘దివానా’ వంటి చిత్రాలన్నీ సన్నీడియోల్‌ కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. గత కొంతకాలంగా సహాయ నటుడిగా బాలీవుడ్‌ చిత్రాల్లో మెరుస్తున్నాడు. 1956 అక్టోబరు 19న ప్రముఖ నటుడు ధర్మేంద్ర, ప్రకాశ్‌ కౌర్‌లకు జన్మించిన సన్నీ డియోల్‌.. 1984లో పూజా డియోల్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకి ఇద్దరు కుమారులున్నారు. ఈ మధ్యనే సన్నీ తన కుమారుడైన కరణ్‌ డియోల్‌ని తెరపరిచయం చేస్తూ ‘పల్‌ పల్‌ దిల్‌ కే పాస్‌’ చిత్రానికి దర్శకత్వం కూడా చేశారు. ఈరోజు సన్నీ డియోల్‌ పుట్టినరోజు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* వీర సైనికుడి కథ!


ఒకప్పుడు అమెరికాలో అంతర్యుద్ధాలు జరుగుతుండేవి. అలాంటి ఓ అంతర్యుద్ధంలో కాలును కోల్పోయినా, ప్రాణాలకు తెగించి తీవ్రవాదులను ఎదుర్కొని విజయం సాధించిన ఓ వీర సైనికుడిని కోరుకున్న చోటుకి బదిలీ చేస్తామంటుంది ప్రభుత్వం. అలా వెస్టన్ర్‌ ప్రాంతానికి వెళతాడు అతడు. అక్కడ కోయ తెగల వాళ్లు, తోడేళ్లు తప్ప ఎవరూ ఉండరు. మొదట వ్యతిరేకించిన వాళ్లతోనే స్నేహం చేస్తాడు. వాళ్లతో పాటు ఉండే ఓ తెల్ల యువతిని కలుసుకుంటాడు. చివరకి వాళ్లందరి గౌరవాన్ని పొందుతాడు. ఈ కథతో వచ్చిన ‘డ్యాన్సెస్‌ విత్‌ వోల్వ్స్‌’ సినిమా 7 ఆస్కార్‌ అవార్డులతో సహా ఎన్నో పురస్కారాలు గెలుచుకుంది. 22 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీసిన ఈ సినిమా 424 మిలియన్‌ డాలర్లకు పైగా ఆర్జించింది. కెవిన్‌ కాస్ట్‌నర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1990 అక్టోబర్‌ 19న విడుదలైంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.