ఈ రోజు (ఆగస్టు 24)
* ‘గాంధీ’ తీసిన దర్శకుడు!

జాతిపిత మహాత్మాగాంధీ జీవిత కథను అత్యద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడిగా రిచర్డ్‌ అటెన్‌బరో భారతీయులకు ఎప్పటికీ గుర్తుండిపోతాడు. దర్శకనిర్మాతగా, నటుడిగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నేతగా పేరొందిన అటెన్‌బరో ముద్ర వెండితెరపై చిరస్మరణీయం. ప్రతిష్టాత్మకమైన బాఫ్తా (బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్‌¬్స), రాడా (రాయల్‌ అకాడమీ ఆఫ్‌ డ్రమెటిక్‌ ఆర్ట్‌)లకు అధ్యక్షుడిగా వ్యవహరించాడు. రెండో ప్రపంచయుద్ధంలో రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫిల్మ్‌యూనిట్‌లో పాల్గొని ఎన్నో బాంబు దాడులను చిత్రీకరించాడు. దర్శకనిర్మాతగా 1983లో తీసిన ‘గాంధీ’ చిత్రానికి రెండు ఆస్కార్‌ అవార్డులు అందుకున్నాడు. ‘గాంధీ’ చిత్రం 20 శతాబ్దంలోని మేటి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. నటుడిగా నాలుగు బాఫ్తా, నాలుగు గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులు అందుకున్నాడు. ‘ఇన్‌ బ్రిగ్టన్‌ రాక్‌’, ‘ద గ్రేట్‌ ఎస్కేప్‌’, ‘10 రిల్లింగ్టన్‌ ప్లేస్‌’, ‘ద శాండ్‌ పెబుల్స్‌’, ‘మిరకిల్‌ ఆన్‌ 34 స్ట్రీట్‌’, ‘జురాసిక్‌ పార్క్‌’ చిత్రాల్లో నటుడిగా ఆయన పాత్రలను అభిమానులు మరిచిపోలేరు. కేంబ్రిడ్జ్‌లో 1923 ఆగస్టు 29న పుట్టిన అటెన్‌బరో, తొలుత నాటకాల ద్వారా మంచి నటుడిగా రాణించాడు. సినిమాలకు 1942లో పరిచయమై పలు పాత్రలతో ఆకట్టుకున్నాడు. నిర్మాతగా 1950ల్లో మంచి చిత్రాలు అందించాడు. దర్శకుడిగా ‘ఓహ్‌! వాటె లవ్లీ వార్‌’ (1969) అతడి తొలిచిత్రం. బ్రిటిష్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్, ప్రముఖ హాస్యనటుడు ఛార్లెస్‌ చాప్లిన్‌ బయోపిక్‌లను కూడా రూపొందించాడు. అటెన్‌బరో 2014 ఆగస్టు 24న తన 90 ఏళ్ల వయసులో మరణించాడు.
* అంజమ్మగా పుట్టి... సీతమ్మగా నిలిచి! (అంజలీదేవి జయంతి−1927)
పౌరాణిక చిత్రం ‘లవకుశ’... జానపద చిత్రం ‘సువర్ణసుందరి’... చారిత్రక చిత్రం ‘అనార్కలి’... ఈ మూడింటిలోనూ నటించి మెప్పించడం తేలిక కాదు. కానీ అంజలీదేవికి అది సునాయాసమే. అందుకే ఇన్నాళ్లయినా ఆమె, సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. ఓ సీతగా, ఓ దేవకన్యగా, ఓ అందాల భామగా ఆమె నటన చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో అంజమ్మగా పుట్టి, వెండితెరపై అంజలీదేవిగా మారి ఎన్నెన్నో పాత్రలు ధరించి ఒప్పించినా... ఓ సీతమ్మగా మెప్పించిన ఆమె వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిదే. నాటక రంగం నుంచి సినీరంగానికి వచ్చిన అంజలీదేవి దాదాపు 350 చిత్రాల్లో నటించడంతో పాటు నిర్మాతగా ఆణిముత్యాల లాంటి సినిమాలను అందించారు. సంగీత దర్శకుడు పి. ఆదినారాయణరావును వివాహమాడిన అంజలీదేవికి ఇద్దరు కుమారులు. ప్రతిషాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న ఆమె, చెనై¬్నలో తన 86వ ఏట 2014 జనవరి 13న మరణించారు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* పాటల ఇంజినీర్‌! (రామజోగయ్య శాస్త్రి పుట్టినరోజు−1970)
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎమ్‌టెక్‌ చదివి ఇంజనీర్‌గా యంత్రాలతో పనిచేయడం ఎక్కడ! సినిమాల్లో మనసుకు హత్తుకునే సాహిత్యంతో గీతాలు అల్లడం ఎక్కడ!! ఈ రెండిటినీ సాధించిన రామజోగయ్య శాస్త్రిని పాటల ఇంజనీర్‌ అనవచ్చు. ఆయన పాట రాశాడంటే అది యువతరం నాలుకల మీద నాట్యమాడాల్సిందే. అంతలా ఆకట్టుకునే క్యాచీ పదాలతో లిరిక్కులతో జిమ్మిక్కులు చేసి చమక్కుమనిపించగలరు ఆయన.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* హ్యారీపాటర్‌ స్నేహితుడి కథ!
హ్యారీపాటర్‌కి ఇద్దరు స్నేహితులు. ఒకరు రాన్‌ వెస్లే అయితే మరొకరు హెర్మాయిన్‌ గ్రాంగర్‌. వీరు ముగ్గురూ కలిసి హ్యారీపాటర్‌ సినిమాల్లో చాలా హంగామా చేశారు. వీరిలో రాన్‌ వెస్లే పాత్రలో నటించిన నటుడే రుపర్ట్‌ అలెగ్జాండర్‌ లాయిడ్‌ గ్రింట్‌. 1988 ఆగస్టు 24న ఇంగ్లండ్‌లో పుట్టిన ఇతగాడు చిన్నతనంలోనే నాటకాల్లో నటించి ఆ అనుభవంతో 11 ఏళ్లకే హ్యారీపాటర్‌ సినిమాలకు ఎంపికయ్యాడు. ఎనిమిది హ్యారీపాటర్‌ సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత ఇప్పుడు 29 ఏళ్ల యువ నటుడిగా కొనసాగుతున్నాడు. నిర్మాతగా కూడా మారాడు. విరాళాలు ఇస్తూ సమాజసేవలో పాల్గొంటున్నాడు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.