ఈరోజే (ఆగస్టు 25...)
* తొలి జేమ్స్‌బాండ్‌!
సీన్‌ కానరీ... అనగానే ‘జేమ్స్‌బాండ్‌’ పాత్ర ఒక్కటే గుర్తొసుంది. అంతలా ఆ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్న నటుడతడు. ఆస్కార్‌, బాఫ్తా, గోల్డెన్‌గ్లోబ్‌ లాంటి ఎన్నో అవార్డులు అందుకున్న సీన్‌కానరీ బ్రిటిష్‌ ప్రభుత్వ పురస్కారమైన ‘నైట్‌హుడ్‌’ అందుకుని ‘సర్‌’ బిరుదు పొందాడు. జేమ్స్‌బాండ్‌ పాత్రలో 1962 నుంచి 1983 వరకు ఏడు సినిమాల్లో నటించి ‘సెక్సీయస్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద సెంచరీ’ గుర్తింపు పొందాడు. ‘ద అన్‌టచబుల్స్‌’తో ఆస్కార్‌ అందుకున్నాడు. ‘మార్నీ’, ‘ద నేమ్‌ ఆప్‌ ద రోజ్‌’, ‘ద లీగ్‌ ఆఫ్‌ ద ఎక్స్‌ట్రార్డినరీ జెంటిల్‌మెన్‌’ ‘ఇండియానా జోన్స్‌ అండ్‌ ద లాస్ట క్రుసేడ్‌’, ‘ద హంట్‌ ఫర్‌ రెడ్‌ అక్టోబర్‌’, ‘డ్రాగన్‌ హార్ట్‌’, ‘దరాక్‌’ లాంటి చిత్రాల ద్వారా ఆకట్టుకున్నాడు. 1930 ఆగస్టు 25న స్కాట్‌లాండ్‌లో పుట్టిన సీన్‌కానరీ తల్లి ఒక క్లీనింగ్‌ ఉమన్‌ కాగా, తండ్రి లారీ డ్రైవర్‌. పద్దెనిమిదేళ్లకే 6 అడుగుల 2 అంగుళాల ఎత్తుగా ఎదిగిన సీన్‌కానరీ మొదట మిల్క్‌మాన్‌గా పనిచేసి రాయల్‌నేవీలో చేరాడు. అనారోగ్య కారణాల వల్ల నేవీ నుంచి బయటకి వచ్చాక లారీడ్రైవర్‌గా, కార్మికుడిగా ఏవేవో పనులు చేశాడు. అదనపు ఆదాయం కోసం నాటకాలలో పాత్రలు ధరిస్తుంటే సినిమా ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసి వెళ్లాడు. అలా ‘సౌత్‌ పసిఫిక్‌’ (1954) సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. ఆదాయం కోసం ఎక్స్‌ట్రా వేషాలు వేస్తూనే టీవీల్లో కూడా నటించేవాడు. 1962లో జేమ్స్‌బాండ్‌ పాత్రకు అవకాశం వచ్చింది. అలా ‘డాక్టర్‌ నో’, ‘ఫ్రమ్‌ రష్యా విత్‌ లవ్‌’, ‘గోల్డ్‌ఫింగర్‌’, ‘థండర్‌బాల్‌’, ‘యు ఓన్లీ లివ్‌ ట్వైస్‌’, ‘డైమండ్స్‌ ఆర్‌ ఫరెవర్‌’, ‘నెవర్‌ సే నెవర్‌ ఎగైన్‌’ చిత్రాల్లో నటించడం ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందాడు.* మాస్‌ దర్శకుడు! (ఎ.ఎస్‌. రవికుమార్‌ చౌదరి పుట్టిన రోజు)
మాస్‌ ప్రేక్షకుల నాడి తెలిసిన తెలుగు దర్శకుల్లో ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి ఒకరు. ‘యజ్ఞం’, పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రాలతో మంచి విజయాల్ని అందుకొన్నారు. వాణిజ్యాంశాలతో సినిమాలు తీయడంలో మంచి పట్టున్న దర్శకుడిగా ఆయనకి పేరుంది. తెనాలి సమీపంలోని నారాకోడూరులో జన్మించిన రవికుమార్‌ చౌదరి గుంటూరులోని జేకేసీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. తన ఊరి వాతావరణం, కాలేజీలో స్టేజీ రంగస్థలం ఆయన్ని కళలపై దృష్టిపెట్టేలా చేశాయి. 1994లో సినిమాలపై మక్కువతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ‘అమ్మ దొంగా’ చిత్రానికి సీనియర్‌ దర్శకుడు సాగర్‌ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆయన దగ్గరే పదేళ్లపాటు పనిచేశారు రవికుమార్‌ చౌదరి. మధ్యలో శ్రీనువైట్ల తెరకెక్కించిన ‘నీ కోసం’ కోసం పనిచేశారు. అలాగే సాయికుమార్‌ నటించిన ‘అతను’ చిత్రానికి రచయితగా పనిచేశారు. సంగీత దర్శకుడు చక్రవర్తి దర్శకత్వం వహించిన టీవీ సీరియల్‌ ‘దొందూ దొందే’కి కూడా రచయితగా పనిచేశారు. ‘మనసుతో’ అనే చిత్రంతో దర్శకుడిగా మారిన ఆయనకి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. అయితే నిరుత్సాహపడకుండా మరో స్క్రిప్టు సిద్ధం చేసుకొని ‘యజ్ఞం’ తెరకెక్కించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో రవికుమార్‌ చౌదరి పేరు పరిశ్రమలో గట్టిగా వినిపించింది. ఆ తర్వాత ‘వీరభద్ర’, ‘ఆటాడిస్తా’, ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రాలు పరాజయాల్నే మిగిల్చాయి. 2014లో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రాన్ని తెరకెక్కించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్నారు రవికుమార్‌ చౌదరి. ఆ చిత్రం తర్వాత గోపీచంద్‌తో ‘సౌఖ్యం’ చేశారు.కానీ ఫలితం రాలేదు. తర్వాత ఓ మల్టీస్టారర్‌ కథని సిద్ధం చేసుకొన్నారు కానీ... అది పట్టాలెక్కలేదు. ‘జగడం’లో నటుడిగా కూడా ప్రేక్షకుల్ని మెప్పించారు ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి. రచయితగా, నటుడిగా, దర్శకుడిగాప్రతిభ చూపిన రవికుమార్‌ చౌదరి పుట్టినరోజు ఈరోజు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.