మే 15 (సినీ చరిత్రలో ఈరోజు)...

* ‘ఇస్మార్ట్‌..’ రామ్‌ (పుట్టినరోజు-1987)


హుషారుకి మారు పేరు రామ్‌. ఎనర్జిటిక్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడాయన. తెరపైన ఎంత వేగంగా సందడి చేస్తుంటారో... తెర వెనక కూడా ఆయన అంతే హుషారుగా కనిపిస్తుంటారు. పరిశ్రమ నిండా యువ కథానాయకుల జోరు కనిపిస్తున్న సమయంలో తెరంగేట్రం చేశారు రామ్‌. అంత పోటీలోనూ, తనదైన ప్రత్యేకతని ప్రదర్శించి గుర్తింపు సొంతం చేసుకొన్నారు. రామ్‌ తన నటనతో తెలుగు పరిశ్రమపై తనదైన ముద్ర వేశాడు. బలమైన మార్కెట్‌ ఉన్న యువ కథానాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ నిర్మాత, స్రవంతి మూవీస్‌ అధినేత స్రవంతి రవికిషోర్‌ తమ్ముడు మురళి పోతినేని తనయుడైన రామ్‌ హైదరాబాద్‌లో 1987 మే 15న జన్మించారు. తమిళనాడులోని చెన్నైలోని చెట్టినాడ్‌ విద్యాశ్రమం, సెంట్‌ జాన్‌ పాఠశాలలో ఆయన విద్యాభ్యాసం సాగింది. పాఠశాల వయసులోనే ఆయనకి సినిమా పరిశ్రమ నుంచి అవకాశాలు అందాయి. ఎన్‌.జె.భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకొన్న రామ్‌... వై.వి.యస్‌.చౌదరి దర్శకత్వం వహించిన ‘దేవదాస్‌’ చిత్రంతో తెరకు పరిచయమయ్యారు. 2006 జనవరి 11న విడుదలైన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకొంది. తొలి సినిమాతోనే రామ్‌ గురించి పరిశ్రమ వర్గాలు, ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకొన్నారు. ఆ తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో ‘జగడం’ చేశారు. ఈ చిత్రం పెద్దగా విజయవంతం కాలేదు కానీ... రామ్‌కి మంచి ప్రశంసలే లభించాయి. ఆ తర్వాత అగ్ర దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘రెడీ’ చేశాడు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. రామ్‌ కుటుంబ ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. ఆ తర్వాత చేసిన ‘మస్కా’, ‘గణేష్‌’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’ పర్వాలేదనిపించాయి. ‘కందిరీగ’తో మళ్లీ మునుపటి ఫామ్‌ని అందుకున్న ఆయన ఆ తర్వాత ‘ఎందుకంటే ప్రేమంట’, ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’, ‘పండగ చేస్కో’, ‘శివమ్‌’ చిత్రాలు చేశారు. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘నేను శైలజ’ చేసి మరో విజయాన్ని అందుకోవడంతో పాటు, తన నటనలో స్టైల్‌ని కూడా మార్చేశాడు. ‘హైపర్‌’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురు ప్రేమకోసమే’ తదితర చిత్రాలు చేసిన రామ్, ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చేస్తున్నారు. ఈ చిత్రంతో ఆయన లుక్‌ పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్‌ కుర్రాడిగా రామ్‌ సందడి చేయబోతున్నాడు. బుధవారం రామ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ టీజర్‌ని విడుదల చేయబోతున్నారు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)


* ఉర్రూతలూగించిన నటన

(మాధురీ దీక్షిత్‌ పుట్టినరోజు)(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)
* వెండితెరపై మిక్కీమౌస్‌!వాల్ట్‌డిస్నీ సృష్టించిన అల్లరి ఎలుక.. డిస్నీ సంస్థకు మస్కట్‌గా మారిన ఎలుక... వేలాది కార్టూన్లు, సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్నీ పెద్దల్నీ అలరించిన ఎలుక... కోట్లాది రూపాయల వ్యాపారానికి మూలమైన ఎలుక... అదే ‘మిక్కీమౌస్‌’! అలాంటి మిక్కీమౌస్‌ తొలిసారిగా వెండితెరపై దర్శనమిచ్చిన సినిమా ఏంటో తెలుసా? ‘ప్లేన్‌ క్రేజీ’. యానిమేషన్‌ పద్ధతిలో తెరకెక్కించిన ఈ మూకీని 1928 మే 15న తొలిసారిగా ప్రేక్షకులకు చూపించారు. అయితే డిస్ట్రిబ్యూటర్లు దొరకకపోవడంతో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి కాలేదు. అదే ఏడాది డిస్నీ తొలి టాకీ కార్యూన్‌గా ‘స్టీమ్‌బోట్‌ విల్లే’ని విడుదల చేసింది. తిరిగి 1929లో ‘ప్లేన్‌క్రేజీ’ని టాకీగా మార్చి విడుదల చేశారు. మిక్కీమౌస్‌ తన స్నేహితులతో కలిసి చెక్కలతో ఓ విమానాన్ని తయారు చేసి ఎగరడం ఈ ఆరు నిమిషాల సినిమాలో కథాంశం.

* సంగీతభరితం... రికార్డుల మయం


అందమైన అమ్మాయిలతో, చక్కని పాటలతో, ఓ మంచి ప్రేమకథను చూడాలనుకుంటే ‘జిజి’ (1958) చూడొచ్చు. కొలెట్టే అనే ఓ ఫ్రెంచి రచయిత్రి 1944లో రాసిన ఓ నవల ఆధారంగా తీసిన ఈ సినిమా సినీ సంగీత ప్రియులకు విపరీతంగా ఆకట్టుకుంది. ‘వందేళ్లు... వంద మంచి సినిమాలు’ జాబితాలో చోటు సంపాదించుకోవడమే కాకుండా, మూడు మిలియన్ల పెట్టుబడికి 13 మిలియన్‌ డాలర్ల వసూళ్లు సాధించింది. ఏకంగా 9 ఆస్కార్‌ అవార్డులను కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. అయితే ఈ రికార్డు కేవలం ఒక ఏడాది మాత్రమే ఉంది. తర్వాత ‘బెన్‌హర్‌’ సినిమా 11 అవార్డులు సాధించి ఈ రికార్డును తిరగరాసింది. ఇంకా ఆరు గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులు, మరో మూడు ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకుంది.

* మళ్లీ వచ్చిన ష్రెక్‌


భారీ శరీరంతో, ఆకుపచ్చ రంగుతో, మాయలు గ్రాఫిక్కులతో ‘ష్రెక్‌’ నాలుగు సినిమాల్లో సందడి చేశాడు. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందాయి. ఈ సినిమాల పరంపరలో రెండో సీక్వెల్‌గా వచ్చిన సినిమా ‘ష్రెక్‌2’ 2004లో వచ్చింది. ఇది 2001లో వచ్చిన తొలి సినిమాకు కొనసాగింపు. ఈ సినిమా 150 మిలియన్‌ డాలర్ల వ్యయానికి 919.8 మిలియన్‌ డాలర్లు వసూలు చేసి సంచలనం సృష్టించడంతో పాటు పలు అవార్డులను కూడా గెలుచుకుంది.

* స్టార్‌వార్స్‌ సందడి


పెట్టుబడి 113 మిలియన్‌ డాలర్లు...  వసూళ్లు 848.8 మిలియన్‌ డాలర్లు!
ఈ సంచలనం ‘స్టార్‌వార్స్‌: ఎపిసోడ్‌3- రివెంజ్‌ ఆఫ్‌ ద సీత్‌’ (2005) సినిమాది. ‘స్టార్‌వార్స్‌’ సినిమాలంటేనే అంత. ప్రముఖ దర్శకనిర్మాత జార్జిలూకాస్‌ రాసి, తీసిన ఈ సినిమాలన్నీ కాసుల వర్షం కురిపించినవే. వీటి సందడి ఎప్పుడో 1977లో తొలి సినిమాతోనే మొదలైంది. నిజానికి అది తొలి సినిమానే కానీ, ఆ తర్వాత దానికి మూడు ప్రీక్వెల్స్‌ తీయడంతో మొదటి దాని పేరు ‘ఎపిసోడ్‌ 4-ఎ న్యూ హోప్‌’గా మారింది. దీని తర్వాత మరో మూడు సీక్వెల్స్‌ వచ్చాయి. ఆపై మరో మూడు భాగాలు కూడా వచ్చాయి. మరో భాగమైన ‘ఎపిసోడ్‌ 9-ద రైజ్‌ ఆఫ్‌ ద స్కైవాకర్‌) 2019లో రాబోతోంది. ఏ భాగమైనా, ఈ సినిమాల కథలన్నీ అంతరిక్ష ప్రయాణాలు, అత్యాధునిక ఆయుధాలు, గ్రహాంతర వాసులు, వాళ్లతో యుద్ధాలు, రోదసిలో సామ్రాజ్యాలు... ఇలా సకల హంగామాతో సాగిపోతాయి. ఇవన్నీ విజయవంతమై గిన్నిస్‌ రికార్డును కూడా సాధించాయి. మొత్తం మీద ఇవన్నీ కలిసి 65 బిలియన్‌ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాయి. ‘రివెంజ్‌ ఆఫ్‌ సీత్‌’ సినిమా 2005 మే 15న కేన్స్‌ చిత్రోత్సవంలో ప్రీమియర్‌ షోగా ప్రదర్శితమై, మే 19న విడుదలైంది.
* మూకీ, టాకీల మధ్య ప్రేమ కథ!


ఈ  సినిమాకు చాలా ప్రత్యేకతలున్నాయి...

1. అది 2011లో పూర్తి బ్లాక్‌ అండ్‌ వైట్‌లో తీసింది!
2. కథా కాలం 1927 నుంచి 1932 వరకు జరిగింది!
3. మూకీల నుంచి టాకీలు వస్తున్న కాలం నాటి కథ!
4. అయిదు ఆస్కార్, మూడు గోల్డెన్‌గ్లోబ్, 
5. కేవలం 15 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో తీస్తే 133.4 మిలియన్‌ డాలర్ల వసూళ్లు రాబట్టింది!
6 బాఫ్టా, ఆరు ఫ్రెంచి సీజర్‌ అవార్డులతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకుంది!

ఫ్రెంచి దర్శకుడు మిచెల్‌ హజానవిసియస్‌ తీసిన ఆ సినిమా ‘ద ఆర్టిస్ట్‌’.

ఇన్ని అవార్డులు, ప్రశంసలు పొందిన ఆ సినిమా కథేంటి? మూకీల కాలంలో ఓ స్టార్‌ నటుడు ఓసారి ప్రీమియర్‌ ప్రదర్శనకు వస్తాడు. ఆ సందడిలో ఓ అందమైన అమ్మాయి హఠాత్తుగా వచ్చి ఆ నటుడిని వాటేసుకుని బుగ్గమీద ముద్దు పెడుతుంది. మర్నాడు పత్రికల్లో ఆ ఫొటోను ప్రచురించి ‘ఎవరీ అమ్మాయి?’ అనే కథనాలు వస్తాయి. ఆ అమ్మాయి మర్నాడు ఓ డ్యాన్స్‌ పోటీలకు ఆడిషన్స్‌కి వస్తే ఆ హీరో చూసి, తన తదుపరి సినిమాలో అవకాశం కల్పిస్తాడు. నటన నేర్పించి తీర్చిదిద్దుతాడు. ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులకు నచ్చుతుంది. ఈ లోగా సినిమాలు టాకీలుగా మారుతాయి. ఆమెకు అవకాశాలు వచ్చి పెద్ద స్టార్‌ అయిపోతే, ఆ మూకీల హీరో కనుమరుగైపోతాడు. ఆఖరికి తాగుడుకి బానిసై ఆత్మహత్యకు కూడా పాల్పడతాడు. ఆ దశలో ఆ అమ్మాయి అతడిని గుర్తించి ఇంటికి తీసుకువెళ్లి కోలుకునేలా చేసి, తన నిర్మాతలతో మాట్లాడి, అతడి డ్యాన్సింగ్‌ ప్రావీణ్యానికి తగినట్టుగా తన సరసన ఓ మ్యూజికల్‌ చిత్రంలో అవకాశం కల్పిస్తుంది. ఆ సినిమా పెద్ద హిట్టవుతుంది, వారిద్దరి ప్రేమలాగే! రంగులు, స్కోపులు, సాంకేతిక మార్పులు చోటు చేసుకుంటున్న సమయంలో బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాను తీయడం ఓ సాహసమనుకుంటే, ఆ సినిమా విజయవంతమవడం ఓ విచిత్రమే.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.