ఎదురులేని... ‘ఇ.టి’ పాప!

ప్రపంచ వ్యాప్తంగా ‘ఇ.టి’ సృష్టించిన సంచలన ఇంతా అంతా కాదు. ‘ఎక్స్‌ట్రా టెర్రెస్ట్రియల్‌’ సంక్షిప్త రూపంగా ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తీసిన ఈ సినిమాలో ఆకట్టుకున్న ఆరేళ్ల చిన్నపాప, ఆ తర్వాత హాలీవుడ్‌లో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా, మోడల్‌లో, వ్యాపార వేత్తగా దూసుకుపోయింది. ప్రతిష్ఠాత్మకమైన ఎన్నో అవార్డులు అందుకుంది. ఆమే డ్య్రూ బ్యారీమోర్‌. తరతరాలుగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నటకుటుంబంలో పుట్టిన ఈమె, చిన్నతనం నుంచీ చురుకే. ఈమె తల్లితండ్రులే కాదు, నాన్నమ్మ, తాతయ్యలు కూడా నటులే కావడం విశేషం. చిన్న వయసులోనే సంచలన తారగా ప్రఖ్యాతి పొందిన ఈమె, వ్యసనాలకు బానిసై పతనం లోతుల్లోకి దిగజారినా, తిరిగి తేరుకుని ఆత్మకథ ‘లిటిల్‌ గర్ల్‌ లాస్ట్‌’ రాసింది. కాలిఫోర్నియాలో 1975 ఫిబ్రవరి 22న పుట్టిన ఈమె ‘పాయిజన్‌ ఐవీ’, ‘బాయిస్‌ ఆన్‌ ద సైడ్‌’, ‘మ్యాడ్‌ లవ్‌’, ‘స్క్రీమ్‌’, ‘ఎవర్‌ ఆఫ్టర్‌’, ‘ద వెడ్డింగ్‌ సింగర్‌’, ‘50 ఫస్ట్‌ డేట్స్‌’, ‘బ్లెండెడ్‌’, ‘నెవర్‌బీన్‌ కిస్స్‌డ్‌’, ‘చార్లీస్‌ ఏంజెల్స్‌’, ‘కన్‌ఫెషన్స్‌ ఆఫ్‌ ఎ డేంజరస్‌ మైండ్‌’, ‘ఫీవర్‌ పిచ్‌’, ‘బిగ్‌ మిరకిల్‌’, ‘విప్‌ ఇట్‌’ లాంటి సినిమాలతో మంచి నటిగా గుర్తింపు పొందింది. ఆరేళ్ల వయసులోనే స్టార్‌గా పేరొచ్చిన నేపథ్యంలో డ్య్రూ బ్యారీమోర్‌ పదమూడేళ్లకల్లా డ్రగ్స్‌కు అలవాటు పడి ‘రీ హ్యాబిటలైజేషన్‌ సెంటర్‌’లో చేరాల్సి వచ్చింది. పద్దెనిమిది నెలల పాటు మానసికంగా నరకం అనుభవించి, ఓసారి ఆత్మహత్యకు పాల్పడింది కూడా. పదిహేనేల్ల కల్లా వ్యసనాల గుప్పిటి నుంచి బయటపడి తిరిగి కీర్తి శిఖరాలు చేరుకుని స్ఫూర్తిదాయకంగా ఎదిగింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.