స్కార్లెట్‌ సంపాదన అందుకో తరమా!
‘బ్లాక్‌ విడో’ భామ స్కార్లెట్‌ జాన్సన్‌ జోరు ఏమాత్రం తగ్గడంలేదు. సంపాదనలో ఆమెను మించిన నటీమణులు ఇంకెవరూ లేరు. వరుసగా రెండేళ్లూ ఆదాయంలో ఆమెదే ఫస్ట్‌ ర్యాంక్‌. ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న నటీనటుల జాబితాను ఫోర్బ్స్‌ ఏటా విడుదల చేస్తుంది. తాజాగా ప్రకటించిన నటీమణుల జాబితాలో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. గతేడాదీ ఆమెది అదే స్థానం. వీటితో పాటు మరెన్నో ఘనతలు ఆమె సొంతం చేసుకుంది.


*
‘అవెంజర్స్‌’ సిరీస్‌లో బ్లాక్‌ విడో పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది స్కార్లెట్‌. ‘అవెంజర్స్‌’ ద్వారా ఆమెకు భారీ పారితోషికం అందుతోంది. 2018 జూన్‌ నుంచి 2019 జూన్‌ మధ్య ఆమె మొత్తం సంపాదన 56 మిలియన్‌ డాలర్లు కాగా, అందులో ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ పారితోషికమే 35 మిలియన్‌ డాలర్లని ఫోర్బ్స్‌ తెలిపింది. గతేడాది ఆమె ఆదాయం 40.5 మిలియన్‌ డాలర్లు. అంటే గతేడాది కన్నా ఇప్పుడు 15.5 మిలియన్‌ డాలర్లు ఎక్కువ.

*
బ్లాక్‌ విడో పాత్రకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఆ పాత్రనే ప్రధానంగా చేసుకుని మార్వెల్‌ సంస్థ ‘బ్లాక్‌ విడో’ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. స్కార్లెట్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలవుతుంది. దీనికి కూడా ఆమెకు మిలియన్ల కొద్దీ పారితోషికం అందుతోందట.

*
ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న వంద మంది సెలబ్రిటీలతో ఫోర్బ్స్‌ విడుదల చేసే జాబితాలోనూ ఎన్నోసార్లు చోటు దక్కించుకుంది స్కార్లెట్‌. 2006, 2014, 15, 18, 19 సంవత్సరాల్లో ఆమె పేరు ఆ జాబితాలో ఉంది.

*
హాలీవుడ్‌ ప్రముఖులకు గౌరవ సూచకంగా అందించే హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ స్టార్‌ను కూడా అందుకుంది.

*
ప్లేబోయ్‌, ఎఫ్‌హెచ్‌ఎమ్‌ లాంటి ప్రముఖ మ్యాగజీన్లు ప్రపంచ అందగత్తెల జాబితాలో స్కార్లెట్‌ను చేర్చాయి. ఎన్నో మ్యాగజీన్ల కవర్‌ పేజీల మీద ఆమె దర్శనమిచ్చింది. వ్యానిటీ ఫెయిర్‌ మ్యాగజీన్‌ కవర్‌ పేజీ కోసం నగ్నంగా పోజిచ్చి సంచలనం రేపింది. న్యూయార్క్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఆమె మైనపు విగ్రహాన్ని 2015లో ఏర్పాటు చేశారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.