పదహారళ్లకే...

ఆకట్టుకునే అందం ఉంటే సరిపోదు. అలరించే ప్రతిభ కూడా ఉండాలి. ఆ రెండూ ఉన్నాయి కాబట్టే కామెరాన్‌ మిచెల్లీ డయాజ్‌ హాలీవుడ్‌లో నటిగా, నిర్మాతగా, రచయితగా, ఫ్యాషన్‌ మోడల్‌గా ఎదిగింది. ఓసారి ‘ద మాస్క్‌’ సినిమాను గుర్తు తెచ్చుకోండి. అందులో అందాలొలికించిన భామే ఈమె. ‘మై బెస్ట్‌ ఫ్రెండ్స్‌ వెడ్డింగ్‌’, ‘దేరీజ్‌ సమ్‌థింగ్‌ అబౌట్‌ మేరీ’, ‘ఛార్లీస్‌ ఏంజెల్స్‌’, ‘ద స్వీటెస్ట్‌ థింగ్‌’, ‘ఇన్‌ హెర్‌ షూస్‌’... ఇలా ఎన్నో సినిమాలు ఆమె అందాల ప్రతిభకు గీటురాళ్లు. 1972లో ఆగస్టు 30న పుట్టిన ఈమె హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న ‘40+’ తారగా గుర్తింపు పొందింది. ఆమె సినిమాలన్నీ కలిసి ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్‌ డాలర్లు రాబట్టాయి. మేటి శృంగార తారగా, అందాల నటిగా ఎన్నో పత్రికల ఓటింగ్‌లో ఆమె గుర్తింపు పొందింది. అన్నట్టు... ఈమె రచయిత్రి కూడా. ఈమె రాసిన ‘ద బాడీ బుక్‌’ బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచింది. ‘ద లాంగివిటీ బుక్‌’ అనే పుస్తకాన్ని కూడా వెలువరించింది. పదహారేళ్లకే ఆమెను ఫ్యాషన్‌ ప్రపంచం ఆహ్వానించింది. ప్రముఖ కంపెనీలకు మోడలింగ్‌ చేస్తూ దేశదేశాలు తిరిగింది. అంతర్జాతీయ పత్రికలపై ముఖచిత్రాలు, ‘టాప్‌లెస్‌’ ఫొటోలు... అబ్బో, పందొమ్మిదేళ్లకల్లా చాలా హడావుడే చేసింది. మరో రెండేళ్లకి ‘ద మాస్క్‌’ చిత్రంలో తొలి అవకాశం తలుపుతæ్టడం, ఆ సినిమా హిట్‌ కావడంతో సినీ ప్రపంచంలో తారగా తళుకులీనింది. వెలుగులు చిమ్ముతూనే ఉంది. ఆమె మరికొన్ని చిత్రాల్లోను నటించింది. ‘ది అదర్‌ ఉమెన్‌’, ‘సెక్స్‌ టేప్‌’ అనే కామెడీ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. సినిమాల్లో ఇక నటించనంటూ గత ఏడాది అధికారింగా ప్రకటించింది నలభై ఆరేళ్ల కామెరాన్‌.


                                                                                                                                                                 

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.