ఫ్రెంచి అందం... ఆస్కార్‌ చందం
ఇతర భాషల్లో నటించిన నటీనటులకు ఆస్కార్‌ అవార్డు లభించడం చాలా అరుదు. కానీ అదే సాధించింది మారియన్‌ కొటిలార్డ్‌. ఫ్రెంచి సినిమాలో అభినయానికి ఉత్తమ నటి అవార్డు అందుకున్న ఏకైక తారగా రికార్డు సృష్టించింది. అలాగే ఇతర భాషా చిత్రాలో నటించి ఆస్కార్‌ అందుకున్న వారు ఇప్పటివరకు కేవలం ఆరుగురే ఉంటే వారిలో ఒకరిగా నిలిచింది. ఫ్రెంచి గాయని ఎడిత్‌ ప్లాఫ్‌ జీవితం ఆధారంగా తీసిన ‘లా వీ ఎన్‌ రోజ్‌’ (2007) సినిమాలో ఆమె నటనకు ప్రపంచ సినీ అభిమానులు ఫిదా అయపోయారు. ఆ సినిమాలో ఆమె అభినయానికి ఆస్కార్‌తో పాటు గోల్డెన్‌గ్లోబ్, బాఫ్టా, సీజర్, ల్యూమియర్స్‌ అవార్డులు లభించాయి. నటిగా, గాయనిగా, సంగీతకారిణిగా, పర్యావరణవేత్తగా పేరు తెచ్చుకున్న ఈ అందాల తార, ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఇచ్చే ‘నైట్‌ ఆప్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ లెటర్స్‌’ పురస్కారాన్ని అందుకుంది.


ప్యారిస్‌లో 1975 సెప్టెంబర్‌ 30న పుట్టిన కొటిలార్డ్‌ తండ్రి జీన్‌క్లాడ్‌ నటుడు, దర్శకుడు కూడా. తల్లి కూడా నటే. ఆమె కవల సోదరుల్లో ఒకరు స్క్రీన్‌ రైటర్, దర్శకుడిగా రాణించాడు. ఇలాంటి సినీ కుటుంబంలో పుట్టిన కొటిలార్డ్‌ చిన్నప్పటి నుంచే తండ్రి నాటకాల్లో పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఆ పాత్రలు ఆమెను టీవీలకు పరిచయం చేస్తే, ఆపై వెండితెర ఆమెకు ఎర్రతివాచీ పరిచింది. పదిహేడేళ్లకే సినిమా నటిగా మారిన ఆమె తొలుత ఫ్రెంచి సినిమాల్లోను, ఆపై హాలీవుడ్‌ సినిమాల్లోను నటించి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ‘ద స్టోరీ ఆఫ్‌ ఎ బోయ్‌ హూ వాంటెడ్‌ టుబీ కిస్స్‌డ్‌’, ‘టాక్సీ’, ‘బిగ్‌ఫిష్‌’, ‘ఎ వెరీ లాంగ్‌ ఎంగేజ్‌మెంట్‌’, ‘నైన్‌’, ‘రస్ట్‌ అండ్‌ బోన్‌’, ‘టు డేస్‌ వన్‌ నైట్‌’, ‘పబ్లిక్‌ ఎనిమీస్‌’, ‘ఇన్సెప్షన్‌’, ‘ద డార్క్‌ నైట్‌ రైజెస్‌’, ‘మాక్బెత్‌’, ‘ఎల్లీడ్‌’లాంటి సినిమాల్లో అందంతో పాటు అభినయంతో కూడా ఆకట్టుకుంది. నటిగా, గాయనిగా అనేక అవార్డులు అందుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ సామాజిక స్పృహను చాటుకుంటోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.