ప్రియాంకకు ‘జైహింద్‌’ చిక్కులు

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా మరోసారి నెట్టింట తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. అయితే దీనికి కారణం ఆమె జై హింద్‌ అంటూ తన మాతృభూమిపై దేశ భక్తిని చాటడమే. అదేంటి దేశ భక్తి చాటితే విమర్శలెందుకు అని ఆశ్చర్యపోకండి. అసలు విషయం ఏంటంటే? ప్రస్తుతం ప్రియాంక చోప్రా యూనిసెఫ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 2016 నుంచి ఆమె ఈ హోదాలో కొనసాగుతోంది. యూనిసెఫ్‌లో ఉన్నవారు ఏ దేశానికి మద్దతుగా మాట్లాడటం కానీ, ఏ దేశం తరపున ప్రచారం చేయడం కానీ చేయకూడదు. అన్ని దేశాలను సమాన దృష్టితో చూడాల్సి ఉంటుంది. అయితే తాజాగా పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయు సేన పాక్‌లోని ఉగ్రమూకలపై మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ గొప్పదనాన్ని తెలియజేస్తూ.. ‘జైహింద్‌’’ అంటూ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. ఇప్పుడీ పోస్టే ప్రియాంకను చిక్కుల్లో పడేసింది. యూనిసెఫ్‌ అంబాసిడర్‌ అయ్యి ఉండి ఓ దేశం తరపున మాట్లాడటం యుద్ధాన్ని ప్రేరేపించమే అవుతుందని విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను యూనిసెఫ్‌ నుంచి తొలగించాలంటూ పాకిస్థాన్‌తో పాటు పలు దేశాలకు చెందిన వారు సామాజిక మాధ్యమాల వేదికగా డిమాండ్‌ చేస్తున్నారు. ఇలా విమర్శలు చేస్తున్నవారిలో భారత్‌కు చెందిన వారు కూడా ఉండటం మరో కొసమెరుపు. ఏదేమైనా ‘జైహింద్‌’ పోస్ట్‌పై ప్రియాంక ఇప్పుడెలా స్పందిస్తుందో చూడాలి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.