గెటప్‌ అదిరేలా.. మీమ్స్‌ పేలేలా!!
గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రాకు నటిగానే కాక ఫ్యాషన్‌ గర్ల్‌ గాను మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ట్రెండ్‌కు తగ్గట్లుగా స్టైలిష్‌ వస్త్రధారణతో ర్యాంప్‌ షోల్లోనూ పబ్లిక్‌ వేదికలపైనా కనువిందు చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు తన భర్త నిక్‌ జోనాస్‌తో కలిసి అమెరికాలోని మెట్‌ గాలా వేడుకకు హాజరైంది. ఈ వేడుకను ప్రతి ఏటా ఏదోక సరికొత్త థీమ్‌తో నిర్వహిస్తుంటారు నిర్వాహకులు. ఇందులో భాగంగానే ఈసారి ‘క్యాంప్‌: నోట్స్‌ ఆన్‌ ఫ్యాషన్‌’ అనే థీమ్‌ను ఎంచుకున్నారు. అంటే ఈ వేడుకలో పాల్గొనే ప్రతిఒక్కరూ తప్పని సరిగా విభిన్నమైన వస్త్రధారణతోనే ఫ్యాషన్‌ ఉట్టిపడేలా పింక్‌ కార్పెట్‌పై హొయలొలికించాలన్నమాట. దీనికి తగ్గట్లుగానే ఈవెంట్‌కే ప్రత్యేక వన్నె తెచ్చేలా ఓ విభిన్నమైన కాస్ట్యూమ్‌తో సందడి చేసింది ప్రియాంక - నిక్‌ జోడీ. ముఖ్యంగా ప్రియాంక తన గెటప్‌తో ఫ్యాషన్‌ ప్రపంచానికి ముచ్చెమటలు పట్టించినంత పనిచేసింది. ప్రియా తల నుంచి కాలి గోటి వరకు ధరించిన ప్రతి కాస్ట్యూమ్‌లో ఎంతో ప్రత్యేకతను కనబర్చింది. సిల్వర్‌ లైనింగ్‌ డిజైనర్‌ డ్రెస్‌లో ఎన్నో వింతలు విశేషాలు నింపుకొని చూపరులను కట్టిపడేసింది. ప్రియా హెయిర్‌ స్టైల్, దానిపైన ఆమె ధరించిన పొడవాటి ఊచల కిరీటం, చేతికి ధరించిన గాజులు, ఐ మస్కారా.. బొట్టు బిళ్ల ఇలా ప్రతిదీ సిల్వర్‌ లైనింగ్‌కు చక్కగా మ్యాచ్‌ అయ్యాయి. సడెన్‌గా చూస్తే.. పీసీ హాలీవుడ్‌ మాంత్రికురాలిగా మారిపోయిందా అన్నట్లుగానూ కనిపించింది. అయితే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రియాంక లుక్‌పై సరదా సరదా మీమ్స్‌ ట్రెండింగ్‌ మారుతున్నాయి. కొందరు పీసీ హెయిర్‌ స్టైల్‌ను ఐన్‌స్టీన్, లసిత్‌ మలింగల హెయిర్‌ స్టైల్‌తో, వీరప్పన్‌ గడ్డెంతో పోల్చుతూ తయారు చేసిన మీమ్స్‌ విపరీతంగా నవ్వులు పంచుతున్నాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.