నిక్‌ నా జీవితంలోకి రాకపోయేవాడు!!
ప్రియాంక చోప్రా, నిక్‌ జొనాస్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడీ జంట ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. నిక్‌తో డేటింగ్‌లో ఉన్న తొలినాళ్లలో అతణ్ని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ప్రియాంక మనసులో అస్సలు రాలేదట. కొన్ని రోజులకు నిక్‌ అంటే ఎంటో తెలిసిందట. తన భర్త గొప్పతనం గురించి న్యూయార్క్‌లో జరిగిన ‘ఉమెన్‌ ఇన్‌ ది వరల్డ్‌’ 2019 సదస్సులో మాట్లాడింది ప్రియాంక. తన భర్త నిక్‌ తనను ఎంతగానో గౌరవిస్తాడని ఈ వేదికపై గర్వంగా చెప్పింది ప్రియాంక. ‘‘నిక్‌తో డేటింగ్‌లో ఉన్న తొలి రోజుల్లో అతడి గురించి నా అంచనాలు వేరు. నెమ్మదిగా అతడేంటో తెలిసింది. నిక్‌ ఎంతో మంచి మనిషి. చూడ్డానికి నేటితరం అబ్బాయిలా ఉన్నా మనసు మాత్రం పాతతరం బంగారం. ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా నిలిచేవాడు. పొరపాటున పుస్తకం కవర్‌ పేజీని చూసి పుస్తకాన్ని అంచనా వేసినట్లు నిక్‌ విషయంలో చేసి ఉంటే అతడు నా జీవితంలోకి వచ్చుండేవాడు కాదు’’ అని చెప్పింది ప్రియాంక. ఆమె ఏం చేసినా నిక్‌కు గొప్పగానే ఉండేదట. ‘‘నేను భయంకరమైన అమ్మాయిని. నాకు ఏది నచ్చితే అది... ఎప్పుడంటే అప్పుడు చేసేస్తుంటాను. అలాంటి సమయంలోనూ నాతోనే ఉంటాడు నిక్‌. నీకు నేను ఉన్నాననే భరోసా ఇస్తాడు. నన్ను ఎంత గౌరవిస్తాడో.. నా పనిని అంతే గౌరవిస్తాడు. ఓ రోజు నేను ప్రత్యేక సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. అదే సమయంలో స్నేహితులతో పార్టీకి వెళ్లాల్సిన పరిస్థితి. సమావేశాన్ని రద్దు చేసుకుంటున్నానని నిక్‌తో చెప్పాను. దానికి నిక్‌ ఒప్పుకోలేదు. ‘నువ్వు ఈ స్థాయికి రావడానికి ఎంతగానో కష్టపడ్డాం. ఇప్పుడు మీటింగ్‌ రద్దు చేసుకోవడం సరైంది కాదు. నువ్వు వెళ్లి తీరాల్సిందే అని ప్రోత్సహించాడు. నా స్నేహితుల్ని తనే విందుకు తీసుకెళ్లాడు. ఇప్పటివరకూ నా గురించి ఎవ్వరూ అంతలా శ్రద్ధ తీసుకోలేదు. అంతే కాదు నేను ఏం చేసినా మెచ్చుకుంటాడు నిక్‌’’ అని చెప్పింది ప్రియాంక.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.