యూట్యూబ్‌ వేదికగా ప్రియాంక సాహసం
ఇప్పటికప్పుడు కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది ప్రియాంక చోప్రా. బాలీవుడ్‌లో కొన్నేళ్లుగా అగ్రకథానాయికగా వెలుగొందుతోంది. హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి సత్తా చాటుతోంది. మరో వైపు గాయకురాలిగానూ అభిరుచిని చాటుకుంటూ ఆల్బమ్స్‌ను రూపొందించింది. ఇప్పుడు మరో కొత్త సాహసానికి సిద్ధమవుతోంది. ఇటీవలి కాలంలో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్‌ మీడియాలో అడుగుపెడుతోంది ప్రియాంక. యూట్యూబ్‌ వేదికగా ‘ఇఫ్‌ ఐ కుడ్‌ టెల్‌ యూ జస్ట్‌ వన్‌ థింగ్‌’ అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతోందామె. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లోని స్ఫూర్తిదాయక వ్యక్తులతో సంభాషించనుంది. ఆ వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది ప్రియాంక. ‘‘నా జీవితాన్ని విశ్లేషించుకున్నప్పుడు ఇతర వ్యక్తుల పట్ల నాకున్న కుతూహలమే నేను ఈ స్థాయికి ఎదగడానికి కారణమని అర్థమైంది. ఆ కుతూహలంతోనే మరో కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నాను. కొందరు అసాధారణ వ్యక్తులను కలవబోతున్నాను. వారు ఆ స్థాయిని అందుకోవడానికి కారణమేంటని తెలుసుకోబోతున్నాను. వారి మాటల ద్వారా నాకు అవసరమైన స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలనుకుంటున్నాన’’ని పోస్ట్‌ చేసింది ప్రియాంక. తన షోకు తొలి అతిథిగా ఒలింపిక్‌ బంగారు పతక విజేత సిమొన్‌ బైల్స్‌ను ఎంచుకున్నట్లు తెలిపింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.