వినోద రంగంలో ‘రాణి’

‘క్వీన్‌ లతిఫా’... ఈ పేరు వినగానే అమెరికా యువత కేరింతలు కొడతారు. సినీ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తారు. పాప్‌ సంగీత ప్రియులు ఊగిపోతారు. ర్యాపర్‌గా, గాయనిగా, గీత రచయిత్రిగా, నటిగా, నిర్మాతగా చెరిగిపోని ముద్ర వేసిన ఆమె అసలు పేరు డానా ఎలానే ఓన్స్‌. లతిఫా అనేది ఆమె తనకు తాను పెట్టుకున్న పేరు. క్వీన్‌ అనేది ఆమె మొదటి మ్యూజిక్‌ ఆల్బమ్‌ ‘ఆల్‌ హైల్‌ ద క్వీన్‌’ విడుదల తర్వాత అభిమానులు తగిలించినది. ఆమె రికార్డులు లక్షల్లో అమ్ముడుపోయాయి. గాయనిగా ఆమె ఆ రంగంలో ప్రతిష్ఠాత్మకమైన గ్రామీ అవార్డు అందుకుంది. ఆమె నటించిన ‘షికాగో’ సినిమా మేటి చిత్రంగా ఆస్కార్‌ అందుకుంది. ‘బ్రింగింగ్‌ డౌన్‌ ద హౌస్‌’, ‘ట్యాక్సీ’, ‘బార్బర్‌షాప్‌2: బ్యాక్‌ ఇన్‌ బిజినెస్‌’, ‘బ్యూటీ షాప్‌’, ‘లాస్ట్‌ హాలీడే’, ‘హెయిర్‌ స్ప్రే’లాంటి సినిమాలతో నటిగా ఆకట్టుకుంది. టీవీల్లో అనేక కార్యక్రమాల్లో మెరిసింది. మొత్తం మీద గ్రామీ, ఎమ్మీ, గోల్డెన్‌గ్లోబ్, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌లాంటి అవార్డులెన్నో గెలుచుకుంది. న్యూజెర్సీలో 1970 మార్చి 18న పుట్టిన ఈమె, ఎనిమిదేళ్ల వయసులో అరబిక్‌ పేరైన ‘లతిఫా’ను తన మారు పేరుగా ఎంచుకుంది. లతిఫా అంటే సున్నితమైన, దయతో కూడిన అని అర్థం. అయిదు అడుగుల పది అంగుళాల లతిఫా, బాస్కెట్‌బాల్‌ బృందానికి ఒక వరం. ఆ క్రీడలో రాణిస్తూనే గాయనిగా, నటిగా కూడా మెప్పించి ‘హాలీవుడ్‌ హాల్‌ ఆఫ్‌ ఫ్రేమ్‌’లో స్థానం సంపాదించింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.