ఛార్లీ భార్య... భారీ భరణం!

అందాల తారగా హాలీవుడ్‌లో పేరు తెచ్చుకుని... ప్రఖ్యాత హాస్య నటుడు ఛార్లీ చాప్లిన్‌ భార్యగా హోదా పొంది... అతడితో విడాకులతో భారీ భరణం పొందిన నటి లీటా గ్రే. ఛార్లీ చాప్లిన్‌ వివాదాస్పదమైన వ్యక్తిగత జీవితంలో ఓ పార్శ్వం ఆమె. కాలిఫోర్నియాలో 1908 ఏప్రిల్‌ 15న పుట్టిన లీటా గ్రే, ఎనిమిదేళ్ల వయసులో ఛార్లీ చాప్లిన్‌కి ఓ కేఫ్‌లో పరిచయమైంది. పన్నెండేళ్ల వయసులో చాప్లిన్‌ తీసిన ‘ద కిడ్‌’ సినిమాలో నటించింది. పదిహేనేళ్ల వయసులో అతడు తీస్తున్న ‘ద గోల్డ్‌ రష్‌’ సినిమాలో అవకాశం కోసం అతడిని మరోసారి కలిసింది. అప్పటికి చాప్లిన్‌కి 35 ఏళ్లు. వివాహితుడు కూడా. వాళ్లిద్దరి సాహచర్యం వల్ల లీటా గర్భవతైంది. అయితే మైనర్‌తో వివాహం అప్పట్లో చట్టవ్యతిరేకం కావడంతో ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వారికి చార్లెస్‌ చాప్లిన్‌ జూనియర్, సిడ్నీ చాప్లిన్‌ అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. చాప్లిన్‌ తీసిన గోల్డ్‌రష్, ద సర్కస్‌ సినిమాల్లో లీటా గ్రే నటించింది. అయితే ఇతర మహిళలతో చాప్లిన్‌ సంబంధాలు నచ్చకపోవడంతో ఇద్దరి వైవాహిక జీవితం సజావుగా సాగలేదు. దాంతో ఇద్దరూ విడిపోయారు. కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఛార్లీ చాప్లిన్‌ ఆమెకు 6 లక్షల డాలర్లు (ఇప్పటి లెక్కల ప్రకారం 8.7 మిలియన్‌ డాలర్లకు పైమాటే) భరణంగా ఇవ్వాలని, ఆమె ఇద్దరి కొడుకుల పేరి చెరొక లక్ష డాలర్లు (ఇప్పటి లెక్కల ప్రకారం 1.4 మిలియన్‌ డాలర్లు) ట్రస్ట్‌గా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అది అప్పట్లో భారీ మొత్తం. ఆమె కోర్టులో ఛార్లీ చాప్లిన్‌పై దాఖలు చేసిన సుదీర్ఘమైన ఫిర్యాదుల్లో అతడి వివాహేతర సంబంధాల గురించి ఏకరువు పెట్టింది. ఆ కథనాలన్నీ అప్పట్లో పత్రికల్లో వివరంగా ప్రచురితమై సంచలనం సృష్టించాయి. ఛార్లీ తర్వాత ఆమె మరో ముగ్గుర్ని వివాహం చేసుకుంది. ఛార్లీ చాప్లిన్‌తో తన జీవితం గురించి పుస్తకాలు కూడా వెలువరించిన ఆమె, 1995 డిసెంబర్‌ 29న తన 87వ ఏట లాస్‌ఏంజెలిస్‌లో మరణించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.