హీరోకు గాయం వాయిదా పడిన షూటింగ్‌

హాలీవుడ్‌ నటుడు డేనియల్‌ క్రెయిగ్‌కు గాయమైంది. ఆయన నటిస్తున్న ‘జేమ్స్‌ బాండ్‌’ 25వ సినిమా చిత్రీకరణను నిలిపివేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జమైకాలో జరుగుతోంది. సెట్‌లో పరిగెడుతున్నప్పుడు డేనియల్‌ కిందపడిపోయారు. కాలికి తీవ్ర గాయడం కావడంతో డేనియల్‌ చాలా బాధపడ్డారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆయన్ను అమెరికాకు తీసుకెళ్లారనిబ్రిటిష్‌ చెందిన ఓ వార్తా పత్రిక తెలిపింది. త్వరలో లండన్‌లోని ప్రతిష్ఠాత్మక పైన్‌వుడ్‌ స్టూడియోస్‌లో తదుపరి షెడ్యూల్‌ను చిత్రీకరించాల్సి ఉంది. గాయం కారణంగా ఆ చిత్రీకరణ భాగాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది.  డేనియల్‌ నటించే సినిమాల్లో దాదాపు ఎక్కువ శాతం పోరాటలన్నీ డూప్‌ లేకుండా ఆయనే చేస్తారు. దాంతో చాలా సార్లు గాయాలపాలయ్యారు. ‘జేమ్స్‌ బాండ్‌’గా నటించిన తొలి చిత్రం ‘క్యాసినో రాయల్‌’ చిత్రీకరణ సమయంలో డేనియల్‌ స్టంట్స్‌ చేస్తున్నప్పుడు కిందపడి ఆయన పళ్లు ఊడిపోయి, తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ డేనియల్‌ కోలుకుని తన స్టంట్‌ సన్నివేశాలు పూర్తిచేశారు. ‘జేమ్స్‌ బాండ్‌’ సిరీస్‌ నుంచి వస్తున్న 25వ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. ఈ సినిమాకు కేరీ దర్శకత్వం వహిస్తున్నారు. నార్వే, లండన్‌, ఇటలీలో సినిమాను చిత్రీకరించాల్సి ఉంది. సినిమాలో అపహరణకు గురైన ఓ శాస్త్రవేత్తను కాపాడేందుకు మళ్లీ బాండ్‌ను విధుల్లోకి తీసుకొస్తారని, దీని ఆధారంగానే కథ ఉండబోతోందని హాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.