హాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కి?

అతడి కండల శరీరాన్ని చూడగానే హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అని చెప్పేస్తారు. అందుకు తగ్గట్టే వెండితెరపై అద్భుత విన్యాసాలతో అలరిస్తుంటాడు కథానాయకుడు డ్వేన్‌ జాన్సన్‌. ‘జుమాంజీ: వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’ వంటి అనువాద చిత్రాలతో భారత్‌లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘జుమాంజీ: ది నెక్ట్‌ లెవల్‌’ తెరకెక్కింది. దీన్ని తెలుగులో ‘జుమాంజీ: మరో ప్రపంచం’ అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా లండన్‌లో చిత్ర ప్రీమియర్‌ షో జరిగింది. అక్కడి విలేకరులు బాలీవుడ్‌ సినిమాలో మిమ్మల్ని చూడవచ్చా అని ప్రశ్నించగా, అందుకు డ్వేన్‌ జాన్సన్‌ సమాధానం ఇస్తూ... ‘‘ప్రస్తుతానికి ఏమీ చెప్పలేను. బాలీవుడ్‌ అంటే నాకు ఎంతో ఇష్టం, ప్రేమ..గౌరవం కూడా ఉంది’’ అని అన్నాడు. హిందీ కథానాయకుడు వరుణ్‌ధావన్‌ గురించి మాట్లాడుతూ..‘‘ తను నాకు పెద్ద అభిమాని. సామాజిక మాధ్యమాల ద్వారా ఇద్దరం మాట్లాడుకుంటాం. భారత్‌లో అతనో స్టార్‌ కథానాయకుడు అని నాకు తెలుసు. ఏదో ఒక రోజు నన్ను బాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాలో మీరు చూడొచ్చు. అప్పుడు అది మరింత కిక్‌ ఇస్తుంది. ఎందుకంటే భారత్‌లోనూ నాకు అభిమానులున్నారు. త్వరలోనే దీనిపై చర్చిస్తాం’’ అని జాన్సన్‌ చెప్పుకొచ్చాడు. మరి ‘జుమాంజి’ విడుదల తరువాత దీనిపై మరింత సృష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.