జేమ్స్ బాండ్‌గా నటించాలని ఉంది: హెన్రీ కావిల్‌

జేమ్స్ బాండ్ చిత్రాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు. ఆ సినిమాలు చూడ్డానికే చాలామంది వేచి చూస్తుంటారు. ప్రస్తుతం జేమ్స్ బాండ్ 25వ చిత్రంగా ‘నో టైమ్‌ టు డై’ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉండగానే జేమ్స్ బాండ్ వారసుడిగా డేనియల్ క్రెయిగ్‌ తరువాత ఎవరు అనే అంశం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుంది. హాలీవుడ్ నటుడు హెన్రీ కావిల్‌ జేమ్స్ బాండ్ చిత్రాల్లో నటించాలనే కోరికను వ్యక్తం చేశాడు. తాజాగా హాలీవుడ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ‘‘..నేను జేమ్స్ బాండ్ పాత్రలో నటించడం అంటే నాకు చాలా ఇష్టం..’’ అని చెప్పారు. జేమ్స్ బాండ్‌ పాత్ర కోసం ఇప్పటికే ఇద్రిస్‌ ఎల్బా, టామ్‌ హార్డీ, టామ్‌ హిడిల్‌స్టన్‌ లాంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ విధంగా చూస్తే ఎవరికి జేమ్స్ బాండ్‌ పాత్రలో నటించే అవకాశం దక్కుతుందో వేచి చూడాలి. కరోనా వైరస్‌ (కోవిడ్ 19) కారణంగా ఇప్పటికే చాలాసార్లు ‘నో టైమ్‌ టు డై’ చిత్రం వాయిదా పడిన సంగతి తెలిసిందే. కారీ జోజి ఫుకునాగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా రామీ మాలెక్‌ నటిస్తున్నారు. చిత్రాన్ని నవంబర్‌ 12న యూకే, యుఎస్‌ఏలో 20న విడుదల కానుంది. ఇక ఇండియాలో హిందీతో పాటు నవంబర్‌ 25న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. నటుడు హెన్రీ కావిల్‌ గతంలో ‘రెడ్‌ రైడింగ్‌ హుడ్’‌, ‘ది కోల్డ్ లైట్‌ ఆఫ్‌ డే’, ‘మ్యాన్‌ ఆఫ్‌ స్టీల్’‌, ‘జస్టీస్‌ లీగ్’‌ లాంటి చిత్రాల్లో నటించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.