‘ఎండ్‌ గేమ్‌’ను పూర్తిగా చదివింది ఆయన ఒక్కరే!

హాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన సిరీస్‌గా ‘అవెంజర్స్‌’కు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ సిరీస్‌ నుంచి ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. వేసవి కానుకగా ఏప్రిల్‌ 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే, అవెంజర్స్‌ బృందంలో నటించిన వారిలో ఒకే ఒక వ్యక్తి తప్ప మిగిలిన ఎవరికీ ఈ కథ పూర్తిగా తెలియదట. అతడే రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ అలియాస్‌ ఐరన్‌మ్యాన్‌. ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ పూర్తి స్క్రిప్ట్‌ తెలిసిన అతి తక్కువ మంది ఐరన్‌మ్యాన్‌ ఒకరట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకులు రుస్సో బ్రదర్స్‌ ఈ విషయాన్ని తెలియజేశారు. డాక్టర్‌ స్ట్రేంజ్‌ పాత్రలో నటించిన బెనిక్టిడిట్‌ కంబర్‌బ్యాచ్‌కు కూడా పూర్తి స్క్రిప్ట్‌ ఇచ్చినా, ఆయన తన సీన్ల మాత్రమే చదివారట. ఏడాది విరామం తర్వాత అవెంజర్స్‌ సిరీస్‌లో చివరిదైన ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ విడుదలవుతోంది. గత చిత్రంలో థానోస్‌ శక్తితో కనిపించకుండాపోయిన అవెంజర్స్‌ మళ్లీ తిరిగి ఎలా వచ్చారు? థానోస్‌ను ఎలా అంతం చేశారన్నది ఇందులో చూపించబోతున్నారు. ఇంగ్లీష్‌తో పాటు, హిందీ, తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కాబోతుంది.


రాబర్ట్‌ డౌనీ జూనియర్.. రూ.2 కోట్ల కానుక..
 రాబర్ట్‌ డౌనీ జూనియర్.. ‘అవెంజర్స్‌:  ఎండ్‌గేమ్’ చిత్రంలోని తన సహ నటుడైన క్రిస్‌ ఇవాన్స్‌కు ఖరీదైన కారును కానుకగా ఇచ్చారు. ఎండ్‌గేమ్‌లో డౌనీ, ఇవాన్స్‌ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డౌనీ ‘అవెంజర్స్’లో ఇవాన్స్‌ నటించిన కెప్టెన్‌ అమెరికా పాత్రకు సంబంధించిన ఫీచర్లతో 1967 షెవ్రాలే కమారో కారును డిజైన్‌ చేయించారు. దీని ధర 275,000 డాలర్లు. ఈ కారు స్టీరింగ్‌ కెప్టెన్‌ అమెరికా షీల్డ్‌ రూపంలో ఉండటం విశేషం. ‘అవెంజర్స్‌’ సిరీస్‌ నుంచి వస్తున్న చివరి సూపర్‌హీరో చిత్రమిదని హాలీవుడ్‌ వర్గాల సమాచారం. అందుకే డౌనీ ఈ కారును ఇవాన్స్‌కు కానుకగా ఇవ్వాలని 2018లోనే నిర్ణయించుకున్నారట. అమెరికాలోని విస్కన్సిన్‌ ప్రాంతానికి చెందిన స్పీడ్‌కోర్‌ అనే కారు డిజైనింగ్‌ స్టోర్‌ దీనిని రూపొందించిందట. ఈ కారుకు అమర్చిన చక్రాలు, సస్పెన్షన్‌, ఇంజిన్‌, సీట్స్‌, సూపర్‌ఛార్జర్‌ల ధరే 33,000 డాలర్లు ఉంటుందని స్పీడ్‌కోర్‌ అధికార ప్రతినిధి ఎడ్మండ్స్‌ మీడియా ద్వారా వెల్లడించారు. 

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.