కింగ్‌ఖాన్‌ ఈ ఏడాది కనిపించడా??
కొంతకాలంగా ఎదురవుతున్న వరుస పరాజయాలు షారుఖ్‌ ఖాన్‌ను తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ముఖ్యంగా గతేడాది భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘జీరో’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అత్యంత దారుణ ఫలితాన్ని అందించింది. ఓవైపు నటుడిగా సరైన హిట్లు పడకపోవడం.. మరోవైపు నిర్మాతగానూ భారీ నష్టాలు ఎదురవుతుండటం బాలీవుడ్‌ బాద్షా మార్కెట్‌ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో షారుఖ్‌ కూడా పునరాలోచనలో పడ్డట్లు కనిపిస్తున్నాడు. అందుకే ‘జీరో’ తర్వాత మహేష్‌ మతై దర్శకత్వంలో ‘సారే జహాసే అచ్ఛా’ చేసేందుకు ఓకే చెప్పి కూడా తర్వాత దాని నుంచి తప్పుకున్నాడు కింగ్‌ఖాన్‌. ప్రస్తుతానికి సినిమాల నుంచి కొంత విరామం తీసుకోని ఐపీఎల్‌పై దృష్టి పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట షారుఖ్‌. దీని తర్వాత ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో ‘డాన్‌ -3’ను పట్టాలెక్కించేలా ప్రణాళిక రచిస్తున్నాడట. దీన్ని రితేష్‌ సిద్వానీ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. తొలి షెడ్యూల్‌ మలేషియాలో ప్రారంభిస్తారట. ఈ సినిమా స్క్రిప్ట్‌ పనులు ఓవైపు పూర్తవుతున్నప్పటికీ ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లడానికి మరింత సమయం పట్టే అవకాశముందట. ఇప్పుడు ఫర్హాన్‌ ‘తుఫాన్‌’ అనే వేరొక ప్రాజెక్టుతో బిజీగా ఉండటమే దీనికి కారణం. కాబట్టి ఇది పూర్తయితే కానీ.. ‘డాన్‌ 3’ పట్టాలెక్కదు. ఈలెక్కన చూస్తే షారుఖ్‌ నుంచి ఈ ఏడాది మరే కొత్త కబురు వినిపించకపోవచ్చని బాలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.