కండల వీరుడి కథ!

అతడు అధిక బరువులనే కాదు... అధికారాన్ని కూడా మోయగలడు... అందుకే బాడీబిల్డర్‌గా క్రీడారంగంలోను, కండల వీరుడిగా సినిమాల్లోను, గవర్నర్‌గా రాజకీయరంగంలో కూడా రాణించాడు. అతడే ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగర్‌. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రచయితగా, ఉద్యమకారుడిగా, రాజకీయ వేత్తగా బహువిధంగా మెప్పించిన ఆర్నాల్డ్‌ 15 ఏళ్లకే బరువులు ఎత్తడం ప్రారంభించాడు. 20 ఏళ్లకల్లా ‘మిస్టర్‌ యూనివర్శ్‌’ టైటిల్‌ గెలుచుకున్నాడు. అంతర్జాతీయంగా బాడీబిల్డింగ్‌ పోటీలు నిర్వహించే ‘మిస్టర్‌ ఒలింపియా’ విజేతగా ఏడుసార్లు నిలిచాడు. దేహదారుఢ్యంపై అనేక పుస్తకాలు రాశాడు. 1947 జులై 30న పుట్టిన ఆర్నాల్డ్‌కి 23 ఏళ్ల వయసులో సినిమాలపై గాలి మళ్లింది. 1970లో వచ్చిన ‘హెర్క్యులెస్‌ ఇన్‌ న్యూయార్క్‌’తో మొదలు పెట్టి ‘ద లాంగ్‌ గుడ్‌బై’, ‘స్టే హంగ్రీ’, ‘ద విలన్‌’ లాంటి సినిమాలు ఏవేవో చేసినా, 1982లో వచ్చిన ‘కానన్‌ ద బార్బేరియన్‌’ సినిమాతో అతడి పేరు మార్మోగిపోయింది. జేమ్స్‌కామెరూన్‌ తీసిన ‘ద టెర్మినేటర్‌’తో స్టార్‌ అయిపోయాడు. పోరాట వీరుడిగానే కాక, హాస్యం చిలికించే పాత్రల్లోనూ మెప్పించాడు. ‘కమేండో’, ‘రా డీల్‌’, ‘ప్రెడేటర్‌’, ‘రెడ్‌హీట్‌’, ‘టోటల్‌ రీకాల్‌’, ‘కిండర్‌గార్టెన్‌ కాప్‌’, ‘ట్రూలైస్‌’ లాంటి సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు సాధించాడు. కాలిఫోర్నియా గవర్నర్‌గా రెండు సార్లు ఎంపికై రాజకీయ నాయకుడిగా కూడా మెప్పించాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ కెనడీ మేనకోడలైన మారియా షివర్‌ను పెళ్లాడాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.