మరోసారి హాలీవుడ్‌లోకి నీలికళ్ల సుందరి?

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌ త్వరలోనే హాలీవుడ్‌ తెరపై మెరబోతుందా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. గతేడాది ‘ఫన్నేఖాన్‌’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన ఈ నీలికళ్ల సుందరి నుంచి ఇంత వరకు మరో కొత్త కబురేదీ అందలేదు. తన భర్త అభిషేక్‌ బచ్చన్‌తో కలిసి ‘గులాబ్‌ జామూన్‌’లో నటిస్తున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చినప్పటికీ దీనిపై ఇప్పటి వరకు మరే సమాచారమూ అందలేదు. మామ అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి మణిరత్నం దర్శకత్వంలో నటించనున్నట్లు వార్తలైతే వచ్చాయి కానీ, అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఈ నేపథ్యంలో ఐష్‌ తర్వాతి చిత్రం ఏంటన్న దానిపై ఆమె అభిమానుల్లో గందరగోళం నెలకొని ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఐశ్వర్య త్వరలోనే ఓ హాలీవుడ్‌ చిత్రంలో నటించబోతుందట. ఇప్పటికే ఓ ఆంగ్ల దర్శకుడు ఐష్‌కు కథ చెప్పి ఒప్పించాడని, ప్రస్తుతం ఆ స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరికొద్ది రోజుల్లోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఐష్‌ గతంలోనూ హాలీవుడ్‌లో పలు సినిమాలు చేసింది. కానీ, అవేమీ ఆమె కెరీర్‌కు ఉపయోగ పడలేకపోయాయి. చివరిగా ఆమె 2009లో వచ్చిన ‘ది పింక్‌ పాంథర్‌ 2’లో నటించింది. పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ మరో ఆంగ్ల చిత్రంతో అక్కడ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది ఐశ్వర్య. మరి ఈసారైనా అదృష్టం కలిసొచ్చి ప్రియాంక, దీపికల్లా ఐష్‌ కూడా గ్లోబల్‌ స్టార్‌గా మెరుస్తుందేమో చూడాలి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.