హాలీవుడ్‌ స్టార్‌ హీరోను ఎగిరి తన్నిన వ్యక్తి!

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌కు తాజాగా ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆయన శనివారం దక్షిణాఫ్రికాలోని జొహానెస్‌బర్గ్‌లో ‘క్లాసిక్‌ ఆఫ్రికా’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆర్నాల్డ్‌ అభిమానులతో సందడి చేస్తూ వారితో స్నాప్‌చాట్‌ వీడియోను రికార్డ్‌ చేయాలనుకున్నారు. సరిగ్గా అప్పుడే ఓ గుర్తు తెలియని వ్యక్తి వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన్ను కాలితో ఎగిరి తన్ని కిందపడిపోయాడు. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తమై సదరు వ్యక్తిని అక్కడి నుంచి పక్కకు లాక్కుపోయారు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్నాల్డ్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘నన్నెవరో తన్నారని నాకూ ఈ వీడియో చూస్తే కానీ తెలియలేదు. ఆ ఇడియట్‌ నా స్నాప్‌చాట్‌ వీడియోను పాడుచేయనందుకు సంతోషంగా ఉంది. ఒకవేళ మీరు ఈ వీడియో షేర్‌ చేయాలనుకుంటే ఆ వ్యక్తి అరుపులు వినిపించకుండా ఉన్న వీడియోను తీసుకోండి. ఎందుకంటే ఇలా చేసినందుకు అతనిపై స్పాట్‌లైట్‌(పాపులారిటీ) పడకూడదు. దక్షిణాఫ్రికాలోని ఆర్నాల్డ్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో 90 రకాల క్రీడలు ఉన్నాయి. 24వేల అథ్లెట్లు ఉన్నారు. ఈ వీడియో ద్వారా వారికి పాపులారిటీ దక్కేలా చేద్దాం’ అని పేర్కొన్నారు. ఇంతకీ ఆర్నాల్డ్‌ను తన్నిన ఆ వ్యక్తి ఎవరు? ఎందుకీ పని చేశాడు? అన్నది తెలియరాలేదు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.