ఇదే ‘అవతార్‌’ సరికొత్త ప్రపంచం

‘‘అవతార్‌’ సీక్వెల్స్‌లో ఇక మీరు పండోరా గ్రహాన్ని చూడలేరు. మీరంతా ఓ సరికొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారు. రాబోయే ‘అవతార్‌’ ప్రపంచం కాన్సెప్ట్‌ ఆర్ట్‌ ఫొటోలు మీకోసం’’ అంటూ అవతార్‌ సీక్వెల్స్‌ సరికొత్త ప్రపంచాన్ని సినీప్రియులకు చూపించింది చిత్ర బృందం. ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం ‘అవతార్‌’ 2009లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సినీప్రియులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు సినీ ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగానూ అప్పట్లో రికార్డు సృష్టించింది. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘అవతార్‌ 2’, ‘అవతార్‌ 3’, ‘అవతార్‌ 4’, ‘అవతార్‌ 5’ సీక్వెల్స్‌ తెరకెక్కుతున్నాయి. అయితే ఇప్పుడీ సీక్వెల్‌ చిత్రాలకు సంబంధించిన కొన్ని అద్భుతమైన చిత్రాలను చిత్ర బృందం తాజాగా ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇకపై రాబోతున్న కొనసాగింపు చిత్రాల్లో పండోరా గ్రహం కనిపించదని, ఈ ఫొటోల్లో కనిపిస్తున్న సరికొత్త ఊహాలోకమే దర్శనమివ్వబోతున్నట్లు తెలియజేశారు. ఈ చిత్రాలను చూస్తుంటే ముందు నుంచి అనుకున్నట్లుగానే ఈ సీక్వెల్స్‌ అన్నీ సముద్రపు ఒడ్డున, సముద్ర గర్భం నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ అవతార్‌ సిరీస్‌ చిత్రాలు వరుసగా డిసెంబరు 18, 2021.. డిసెంబరు 22, 2023న రానున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించేసింది. ఈ చిత్ర ఫలితాల్ని బట్టి తర్వాతి సీక్వెల్స్‌ను సిద్ధం చేస్తామని కామెరూన్‌ ఇది వరకే ప్రకటించారు.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.