బాండ్‌ను మహిళగా మార్చడాన్ని ఒప్పులేరట

ఎలాంటి చిక్కుముడినైనా విప్పగలిగేంత తెలివుండాలి. ఎంతటి అధునాతనమైన ఆయుధాన్నైనా నేర్పుగా వాడగలిగే నైపుణ్యం ఉండాలి. తనదైన అద్భుత యుద్ధ విద్యలతో శత్రువును అలవోకగా మట్టికరిపించగలగాలి.. ఇలా జేమ్స్‌ బాండ్‌ పేరు చెప్పగానే అనేక అంచనాలు మదిలో మెదులుతాయి. వీటన్నింటి కంటే ముఖ్యంగా బాండ్‌ అంటే ఆరడగుల ఎత్తు, ఆకట్టుకునే రూపంతో గ్రీకు వీరుడులా కనిపించాలి. మరి జేమ్స్‌ బాండ్‌గా ఓ మహిళను ఊహించుకోవల్సి వస్తే.. ప్రేక్షకులు దాన్ని ఎలా అంగీకరిస్తారు. అది సాధ్యమయ్యే పనేనా? చిత్ర బృందానికి ఇలాంటి ప్రశ్న ఎదురైతే వారెం చెప్తారు. తాజాగా ఈ అంశంపై ‘బాండ్‌ 25’ చిత్ర నిర్మాత బార్బరా బ్రకోలి స్పందించింది. తాజాగా జేమ్స్‌బాండ్‌ 25వ చిత్రం జమైకాలో ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘జేమ్స్‌బాండ్‌ పాత్రను పురుషుడే చేయాలని నేనుకుంటున్నా. వ్యక్తిగతంగా మహిళల గురించి, మహిళ ప్రధాన పాత్రలుగా సినిమాలు చేయడానికి నేను ఇష్టపడతా. కానీ, పురుషుడి పాత్రను మహిళగా మార్చడాన్ని నేను అంగీకరించలేను’’ అని అన్నారామె. బాండ్‌ సిరీస్‌ నుంచి రాబోతున్న ఈ 25వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కారీ జోజి పుకునాగ తెరకెక్కించబోతుండగా.. డేనియల్‌ క్రేగ్‌ కథానాయకుడిగా కనిపించబోతున్నారు. ప్రతినాయకుడిగా ఆస్కార్‌ విజేత రమీ మాలెక్‌ నటిస్తున్నారు. నామి హారిస్, రోరే కిన్నియర్, లెయా సెడౌక్స్, బెన్‌ విషా, జెఫ్రీ రైట్‌ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.