బాండ్‌ రొమాంటిక్‌ సీన్స్‌ కోసం శిక్షకులు!

ప్ర
పంచవ్యాప్తంగా జేమ్స్‌ బాండ్‌ చిత్రాలకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ బాండ్‌ సిరీస్‌ నుంచి 24 చిత్రాలు రాగా.. ఒకటి రెండు తప్ప దాదాపు అన్ని చిత్రాలు బాక్సాపీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ప్రస్తుతం ఈ సిరీస్‌ నుంచి 25వ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. బాండ్‌ 23 ‘స్కై ఫాల్‌’, బాండ్‌ 24 ‘స్పెక్టర్‌’ చిత్రాల్లో హీరోగా నటించిన డేనియల్‌ క్రేగ్‌ ఈ ప్రతిష్ఠాత్మక 25వ చిత్రంలోనూ బాండ్‌గా సందడి చేయబోతున్నాడు. కారీ జోజి ఫుకునాగ దర్శకుడు. తాజాగా ఈ చిత్రంకు సంబంధించి ఓ ఆసక్తికర అంశం బయటకొచ్చింది. అదేంటంటే ఈ చిత్రంలో రొమాంటిక్‌ సన్నివేశాలకు మరింత ప్రాధాన్యమివ్వబోతున్నారట. అయితే చిత్ర సీమలో మీటూ ఉద్యమం మారుమోగుతున్న నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుందట చిత్ర బృందం. అదేంటంటే శృంగార సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో చిత్ర కథానాయికలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారట. హీరోయిన్లకు ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నదీ తెలుసుకునేందుకు కొందరు శిక్షకులను సెట్స్‌లో నియమించారట. ఒకవేళ నలుగురితో చెప్పుకోలేని విషయాలు ఏమైనా ఉన్నా వాటిని ఈ శిక్షకుల ద్వారా చిత్ర బృందానికి తెలియజేయవచ్చట. దీంతో పాటు రొమాంటిక్‌ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నటీమణులతో సెట్స్‌లోని వారు ఎలా వ్యవహరించాలనే దానిపై ఈ శిక్షకులు సలహాలు, సూచనలు ఇస్తారట. ఇంతకీ ఈ చిత్రంలో బాండ్‌ గర్ల్‌గా నటిస్తోంది ఎవరో తెలుసా.. అనా డీ ఆర్మ్స్‌. ప్రతినాయకుడిగా ఆస్కార్‌ అవార్డ్‌ విజేత రామి మాలెక్‌ కనిపించనున్నారట. నామి హారిస్, రోరే కిన్నియర్, లెయా సెడౌక్స్, బెన్‌ విషా, జెఫ్రీ రైట్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారట.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.