డిలేటెడ్‌ సీన్స్‌తో.. అవతార్‌ను అధిగమిస్తారా?

అడ్వాన్స్‌ బుకింగ్‌లు ఓపెన్‌ చేస్తే.. క్షణానికి 18 టికెట్లు చొప్పున ఒక్కరోజులో 10 లక్షల టికెట్లు అమ్ముడు పోయాయి. చైనాలో విడుదలై తొలిరోజే రూ.750 కోట్ల వసూళ్లు దక్కించుకొని ట్రేడ్‌ వర్గాలను విస్తుపోయేలా చేసింది. భారత్‌లో ఫస్ట్‌డే రూ.53.10 కోట్లు వసూలు చేసి ఇక్కడ అత్యధిక వసూళ్లందుకున్న చిత్రంగా ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ (రూ.52.25 కోట్లు) రికార్డును బద్దలు కొట్టింది. ఇలా థియేటర్లలో అడుగుపెడుతూనే వరుస రికార్డులు ఒకొక్కటిగా బద్దలు కొడుతుంటే సినీ పండితుల మదిలో మెదిలిన తొలి ఆలోచన ఒక్కటే. అవెంజర్స్‌ కచ్చితంగా ‘అవతార్‌’ అత్యధిక వసూళ్ల రికార్డు (2.788 బిలియన్ డాలర్లు)ను సైతం తిరగరాస్తుందనే అనుకున్నారు. కానీ, ఎండ్‌గేమ్‌కు తొలుత లభించినంత వసూళ్లు.. రోజులు గడుస్తున్న కొద్దీ క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే 2.743 బిలియన్‌ డాలర్ల వసూళ్లతో ‘అవతార్‌’కు అతి చేరువ దాకా వచ్చి ఆగిపోయింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. త్వరలోనే ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్’కు అదనపు సన్నివేశాలు జోడించి తిరిగి విడుదల చేయబోతున్నారు. వీటిలో చిత్ర ఎడిటింగ్‌ సమయంలో తొలగించిన కొన్ని ఆసక్తికర సన్నివేశాలతో పాటు మరొకొన్ని సర్‌ప్రైజ్‌లు కూడా ఉండబోతున్నాయట. ఈ జోడించిన సన్నివేశాలను ఈనెల 28 నుంచి థియేటర్లలో చూడవచ్చట. మరి చిత్ర బృందం చేస్తున్న ఈ ప్రయత్నం ఎంత మేర కాసుల వర్షం కురిపిస్తుందో వేచి చూడాలి. ఒకవేళ ఈ మార్కెటింగ్‌ వ్యూహం ఫలిస్తే.. ప్రస్తుతం అత్యధిక వసూళ్ల చిత్రాల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్న ఎండ్‌గేమ్ అవతార్‌ను వెనక్కు నెట్టి అగ్రస్థానాన్ని అందుకోవచ్చు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.