చంద్రుడిపై అడుగిడిన తొలి వ్యక్తి..


ప్రముఖ అంతరిక్ష వ్యోమగామి, చంద్రుడిపై నడిచిన తొలి వ్యక్తి నీల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌ జీవితాగాథ వెండితెరపై కనువిందు చేయబోతుంది. ‘లా లా లాండా’ చిత్రంతో ఆస్కార్‌ గెలుచుకున్న ప్రముఖ దర్శకుడు డామియన్‌ షాజెల్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘ఫస్ట్‌మ్యాన్‌’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్లుగానే విడుదలైన ఫస్ట్‌లుక్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రముఖ రచయిత జేమ్స్‌ ఆర్‌ హాన్సెన్‌ రచించిన ‘ఫస్ట్‌మ్యాన్‌: ది లైఫ్‌ ఆఫ్‌ నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ పాత్రలో ప్రముఖ హాలీవుడ్‌ నటుడు రయాన్‌ గోస్లింగ్‌ కనిపించబోతున్నాడు. అపోలో-11 మిషన్‌ నేపథ్యం అంతా ఇందులో చూపించనున్నారు. తొలిసారి ఓ మానవుడిని చంద్రుడిపైకి పంపడం వెనుక నాసా ఎంత శ్రమ పడింది.. నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ ఈ చరిత్రాత్మక యాత్ర కోసం ఎలాంటి కఠిన శిక్షణను తీసుకుంది వంటి అంశాల్ని ఇందులో చూపించబోతున్నారు. ఈ సినిమా కోసం రయాన్‌ నాసా ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడట. దాదాపు 60 మిలియన్ల బడ్జెట్‌తో యూనివర్సల్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం అక్టోబరు 12న విడుదల కాబోతుంది.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.