మరో గ్లాడియేటర్‌కు రంగం సిద్ధం

2000లో విడుదలైన హాలీవుడ్‌ చిత్రం ‘గ్లాడియేటర్‌’ ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించడమే కాదు... 11 ఆస్కార్‌ నామినేషన్లు సాధించి సత్తా చాటింది. అందులో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (రస్సెల్‌ క్రోవె) సహా ఐదు పురస్కారాలు కైవసం చేసుకుంది. తన కుటుంబాన్ని అంతమొందించడంతో పాటు తనను బానిసగా మార్చిన రోమన్‌ చక్రవర్తిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ యోధుడు చేసిన పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గతేడాదే సీక్వెల్‌ విషయం ప్రకటించినప్పటికీ ఆ పనులు ఇప్పుడే ఊపందుకున్నాయి. ‘గ్లాడియేటర్‌’ కథ ముగిసిన పాతికేళ్ల తర్వాత జరగబోయే సంఘటనల నేపథ్యంలో సీక్వెల్‌ ఉంటుందని నిర్మాతలు లౌరీ మెక్‌డొనాల్డ్, వాల్టర్‌ పార్క్స్‌ వెల్లడించారు. తొలి భాగాన్ని తెరకెక్కించిన రైడ్లీ స్కాట్‌ సీక్వెల్‌కూ దర్శకత్వం వహించనున్నారు. ‘ది టౌన్‌’, ‘12 స్ట్రాంగ్‌’ చిత్రాల రచయిత పీటర్‌ క్రెయిగ్‌ కథను అందిస్తున్నారు. ప్రధాన తారాగణం వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.