ఆధిపత్య పోరులో మార్వెల్‌ ఏం చేసింది ?

హాలీవుడ్‌లో ఇప్పటి వరకూ ఎన్నో సూపర్‌ హీరో చిత్రాలొచ్చాయి. అయితే వాటిలో కథానాయకులే ప్రధాన పాత్రలు పోషిస్తుంటారు. కథానాయికలు సూపర్‌హీరో చిత్రాలు చేయడం చాలా అరుదు. అలాంటి ఓ చిత్రం ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే ‘కెప్టెన్‌ మార్వెల్‌’. సూపర్‌ హీరో చిత్రాలకు చిరునామా అయిన మార్వెల్‌ సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. ఆ సంస్థ నుంచి వస్తున్న తొలి నాయికా ప్రాధాన్య సూపర్‌ హీరో చిత్రం ఇదే కావడం విశేషం. కెప్టెన్‌ మార్వెల్‌ పాత్రలో ప్రముఖ నటి, ఆస్కార్‌ పురస్కార విజేత బ్రీ లార్సన్‌ నటించింది. అన్నా బొడెన్, ర్యాన్‌ ఫ్లెక్‌ సంయుక్తంగా తెరకెక్కించారు. శుక్రవారం ఈ చిత్రం ఐమ్యాక్స్, త్రీడీ వెర్షన్లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. భారత్‌లో ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. 1995 నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. రెండు గ్రహాంతరవాసుల జాతుల మధ్య ఆధిపత్య పోరులో భూగ్రహం చిక్కుకుంటే కెప్టెన్‌ మార్వెల్‌ ఏం చేసిందన్నది ఈ చిత్ర కథ. లార్సన్‌ తొమ్మిది నెలలు కసరత్తులు చేసి కెప్టెన్‌ మార్వెల్‌ పాత్ర కోసం సిద్దమైందట. జూడో, బాక్సింగ్, రెజ్లింగ్‌లో శిక్షణ తీసుకుందట. ఇందులో ఆమె అద్భుత శక్తులుండే పైలెట్‌గా నటిస్తోంది. అందుకోసం కొన్ని రోజులు ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లో గడిపి పైలెట్‌ల వ్యవహార శైలి గురించి అధ్యయనం చేసింది లార్సన్‌.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.