మరింత ఆలస్యంగా.. ‘బాండ్‌ 25’
ప్రపంచవ్యాప్తంగా జేమ్స్‌ బాండ్‌ చిత్రాలకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ బాండ్‌ సిరీస్‌ నుంచి 24 చిత్రాలు రాగా.. ఒకటి రెండు తప్ప దాదాపు అన్ని చిత్రాలు బాక్సాపీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ప్రస్తుతం ఈ సిరీస్‌ నుంచి 25వ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. బాండ్‌ 23 ‘స్కై ఫాల్‌’, బాండ్‌ 24 ‘స్పెక్టర్‌’ చిత్రాల్లో హీరోగా నటించిన డేనియల్‌ క్రేగ్‌ ఈ ప్రతిష్ఠాత్మక 25వ చిత్రంలోనూ బాండ్‌గా సందడి చేయబోతున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించేసింది. అయితే ఇప్పుడీ చిత్రాన్ని మరింత ఆలస్యంగా 2020 ఏప్రిల్‌ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ బాండ్‌ మూవీ ఇలా వాయిదా పడటం ఇదే తొలిసారి కాదు. సృజనాత్మక విభేదాల కారణంగా తొలుత దీని దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన డానీ బోయెల్‌ అనూహ్యంగా తప్పుకోగా.. ఆ బాధ్యతలను జోజి పుకునాగ చేపట్టారు. ఈ కారణాల వల్ల సినిమా చిత్రీకరణ నత్తనడకన సాగడం మొదలుపెట్టింది. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న స్పై థ్రిల్లర్‌ కావడంతో.. దీన్ని పూర్తి చేయడానికి మరింత సమయం కావాలని పుకునాగా నిర్మాతలను కోరారట. దీంతో ఈ సినిమాను మరో రెండు నెలలు ఆలస్యంగా తీసుకొచ్చేందుకు వారు అంగీకరించారట. డేనియల్‌ క్రేగ్‌కు ఇదే చివరి బాండ్‌ సినిమా. దీని తర్వాత రాబోయే 26వ సిరీస్‌లో కొత్త బాండ్‌ దర్శనమివ్వబోతున్నాడట. ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ 25వ సిరీస్‌కు మైఖేల్‌ జి. విల్సన్, బార్బరా బ్రాకోలి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.