సందడి చేస్తున్న ‘జేమ్స్‌బాండ్‌ 25’

ప్ర
పంచవ్యాప్తంగా జేమ్స్‌ బాండ్‌ చిత్రాలకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ బాండ్‌ సిరీస్‌ నుంచి 24 చిత్రాలు రాగా.. ఒకటి రెండు తప్ప దాదాపు అన్ని చిత్రాలు బాక్సాపీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ప్రస్తుతం ఈ సిరీస్‌ నుంచి 25వ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. బాండ్‌ 23 ‘స్కై ఫాల్‌’, బాండ్‌ 24 ‘స్పెక్టర్‌’ చిత్రాల్లో హీరోగా నటించిన డేనియల్‌ క్రేగ్‌ ఈ ప్రతిష్ఠాత్మక 25వ చిత్రంలోనూ బాండ్‌గా సందడి చేయబోతున్నాడు. ప్రస్తుతం జమైకాలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చిన్న మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. బ్యాగ్రౌండ్‌లో ఊపుతెప్పించేలా ర్యాప్‌ మ్యూజిక్‌ వస్తుండగా.. చిత్రీకరణకు సంబంధించిన పలు సన్నివేశాలతో ఈ వీడియో ఆసక్తికరంగా సాగింది. బాండ్‌ కారు ఛేజ్‌ సన్నివేశాలు, చివర్లో ఆయన చీకట్లో నుంచి స్టైలిష్‌గా నడుచుకుంటూ రావడం ఈ వీడియోకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. డేనియల్‌ క్రేగ్‌కు ఇదే చివరి బాండ్‌ సినిమా. దీని తర్వాత రాబోయే 26వ సిరీస్‌లో కొత్త బాండ్‌ దర్శనమివ్వబోతున్నాడట. ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ 25వ సిరీస్‌కు జోజి పుకునాగ దర్శకత్వం వహిస్తుండగా.. మైఖేల్‌ జి. విల్సన్, బార్బరా బ్రాకోలి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.