ఎల్సాగా ప్రియాంక.. అన్నాగా పరిణీతి!!

హాలీవుడ్‌ అందాల నాయికల మాటలు భారతీయ తారల నోటి నుంచి ఈమధ్య ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ‘మాలిఫిసెంట్‌: ది మిస్ట్రస్‌ ఆఫ్‌ ఈవిల్‌’ చిత్రంలో ఏంజెలీనా జోలీకి పాత్రకు హిందీలో డబ్బింగ్‌ చెప్పింది ఐశ్వర్యరాయ్‌. ఇప్పుడు మరో ఇద్దరు బాలీవుడ్‌ నాయికల గొంతులు హలీవుడ్‌ సినిమాలో వినిపించబోతున్నాయి. 2013లో డిస్నీ సంస్థ నుంచి వచ్చిన యానిమేటేడ్‌ చిత్రం ‘ఫ్రోజెన్‌’. ఎల్సా, అన్నా అనే ఇద్దరు రాకుమార్తెల కథగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘ఫ్రోజెన్‌ 2’ తెరకెక్కింది. వచ్చే నెల 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలోని ఎల్సా పాత్రకు ప్రియాంక చోప్రా, అన్నా పాత్రకు పరిణీతి చోప్రా హిందీలో డబ్బింగ్‌ చెప్పనున్నట్లు డిస్నీ సంస్థ ప్రకటించింది. క్రిస్‌ బక్, జెన్నీఫర్‌ లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా మాట్లాడుతూ ‘‘ఎల్సా అనేది ధైర్యం సాహసాలు నిండిన ఓ అమ్మాయి ఊహజనిత పాత్ర. ఈ పాత్ర నాకు ఎంతో ఇష్టమే కాదు ఈ పాత్రకు గొంతివ్వడం ద్వారా మన ప్రేక్షకులకు ఆ పాత్రను చేరువచేసే అవకాశం దక్కింది. ఇందులో అన్నా పాత్రకు నా చెల్లెలు పరిణీతి డబ్బింగ్‌ చెబుతుందని తెలియగానే నా ఆనందం రెట్టింపైంది. ఎందుకంటే ఇప్పటివరకూ మేమిద్దరం కలిసి నటించే అవకాశం రాలేదు. అది ఇలాంటి ఓ మంచి చిత్రంతో దక్కడం చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పింది. ‘‘ఫ్రోజెన్‌’ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ఫ్రోజెన్‌ 2’కు పనిచేయడం ఆనందంగా ఉంది. యానిమేటేడ్‌ అక్కాచెల్లెళ్ల పాత్రలకు నిజమైన అక్కాచెల్లెళ్లు డబ్బింగ్‌ చెప్పడం మరింత ఆసక్తికరం. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అంది పరిణీతి చోప్రా.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.