అవెంజర్స్‌ నోట.. మురుగదాస్‌ మాటలు

టీవలే ‘సర్కార్‌’ చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు మురుగదాస్‌. ఇప్పుడీ జోరులోనే రజనీకాంత్‌ 166వ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా.. ఈ గ్యాప్‌లోనే ఓ హాలీవుడ్‌ చిత్రానికి మాటలు రాసేందుకు సిద్ధమయ్యాడు మురుగదాస్‌. అది కూడా అలాంటిలాంటి చిత్రం కాదు. ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ మార్వెల్‌ స్టూడియోస్‌ నుంచి వస్తున్న ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ కోసం. ఇప్పటికే ఈ చిత్రానికి తెలుగు, హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ల కోసం రచయితలను ఎంపిక చేసుకోగా.. తమిళ వెర్షన్‌ మురుగదాస్‌ వద్దకు వచ్చి ఆగింది. ఈ చిత్ర కథ తనకు బాగా నచ్చడంతో ఈ రాబోయే సిరీస్‌కు మాటలు రాయాలని నిర్ణయించుకున్నారట మురుగదాస్‌. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిరీస్‌ నుంచి గతేడాది వచ్చిన ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’ ప్రపంచవ్యాప్తంగా రూ.14,500 కోట్ల రికార్డు వసూళ్లు అందుకోవడంతో.. ఇప్పుడు రాబోయే ‘ఎండ్‌ గేమ్‌’పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది మార్వెల్‌ సంస్థ.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.