ఇటు ‘స్కూబీడూ’.. అటు ‘టామ్‌ అండ్‌ జెర్రీ’
‘టామ్‌ అండ్‌ జెర్రీ’ తర్వాత ఆ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా సినీప్రియుల్ని అలరించిన కార్టూన్‌ పాత్రల్లో ‘స్కూబీడూ’ కూడా ఒకటి. ఈ రెండు కార్టూన్‌ సిరీస్‌లు వేరువేరు అయినప్పటికీ వీటి మధ్య ఓ అవినాభావ సంబంధం ఉంది. అదేంటంటే.. ఈ రెండు పాత్రలకూ తన కుంచెతో ప్రాణం పోసింది ఒకరే. ఆయనే ప్రముఖ దర్శక నిర్మాత, కార్టూన్‌ ఆర్టిస్ట్‌ విలియం హన్నా. ఆయన ప్రాణం పోసిన ఈ రెండు కార్టూన్‌ పాత్రలు ప్రపంచ వ్యాప్తంగా చిన్నాపెద్దా తేడా లేకుండా అందరి మదిలో చెరగని ముద్ర వేశాయి. ఈ యానిమేటెడ్‌ సిరీస్‌లకు దక్కిన ఆదరణ చూసి తర్వాతి కాలంలో వీటిని వెండితెరపైకీ తీసుకొచ్చారు. ఇవి కూడా ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపించాయి. అయితే ఇప్పుడీ రెండు కార్టూన్‌ పాత్రలూ మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు ముస్తాబయ్యాయి. ఇక్కడ మరో విశేషమేంటంటే.. ఈ రెండు చిత్రాలను నిర్మిస్తోంది వార్నర్‌ బ్రదర్స్‌ యానిమేటెడ్‌ సంస్థే. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే వీటిలో ముందుగా థియేటర్లలోకి రాబోయేది ‘స్కూబీడూ’నే.

‘స్కూబీడూ’ పాత్రతో ఇప్పటికే వెండితెరపై రకరకాల చిత్రాలు సందడి చేయగా.. తొలిసారి పూర్తి లైవ్‌ యానిమేటెడ్‌ చిత్రాన్ని ప్రేక్షకులకు చూపించబోతుంది వార్నర్‌ టీం. ‘స్కూబీ: హీజ్‌ ఎపిక్‌ టైల్‌ బిగిన్స్‌’ పేరుతో పూర్తి అడ్వెంచరస్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని 2020 మే 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీన్ని టోని సెర్వోన్‌ తెరకెక్కిస్తుండగా.. వార్నర్‌ యానిమేషన్స్, అట్లాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇది సినీప్రియుల్ని పలకరించిన ఆరు నెలల తర్వాత ‘టామ్‌ అండ్‌ జెర్రీ’ల అల్లరిని ప్రేక్షకులకు రుచి చూపించనున్నారు వార్నర్‌ బ్రదర్స్‌ బృందం. ఈసారి ఈ పిల్లీ ఎలుకల అల్లరిని లైవ్‌ యాక్షన్, యానిమేటెడ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబుచేస్తున్నారు. టిమ్‌ స్టోరీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది డిసెంబరు 23న థియేటర్లలోకి రానుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.