ఆకట్టుకుంటున్న ‘టాయ్‌స్టోరీ4’ ట్రైలర్‌
                                 

‘టాయ్‌స్టోరీ’ చిత్రాలకు హాలీవుడ్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్‌ నుంచి వచ్చిన మూడు చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను కొల్లగొట్టాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడీ సిరీస్‌ నుంచి ‘టాయ్‌స్టోరీ 4’ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. జోష్‌ కూలే దీన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. తొలి రెండు చిత్రాల్లో కనిపించి సినీప్రియుల్ని అలరించిన బో పీప్‌ బొమ్మ పాత్ర ఇందులో తిరిగి కనిపించబోతుంది. దీంతో పాటు ఈ సిరీస్‌లో ఫోర్కీ అనే మరో కొత్త బొమ్మ కూడా వచ్చి చేరింది. ఆండీ డావిస్‌ అనే పిల్లాడి వద్ద కొన్ని బొమ్మలుంటాయి. అవన్నీ ప్రాణం ఉన్నవాటిలా ప్రవర్తిస్తుంటాయి. అయితే ఆండీ కుటుంబం మరో ఇంటికి మారిపోదామనుకుంటున్న తరుణంలో తన వద్ద ఉన్న బొమ్మలన్నింటినీ అమ్మేయాలనుకుంటాడు ఆ పిల్లాడు. ఈ నేపథ్యంలో ఆ బొమ్మలన్నీ తమను ఎలాంటి వ్యక్తులు కొనుగోలు చేస్తారో అనే భయంతో ఆండీ తమను అమ్మకుండా చేయాలని రకరకాల ప్లాన్లు వేస్తుంటాయి. ఈ క్రమంలో ఆ బొమ్మలన్నీ చేసే విన్యాసాలు ఏంటి? అవి ఆఖరికి తామనుకున్నట్లు ఆండీతోనే ఉండిపోయాయా? అన్నది మిగిలిన కథ. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.