సైన్స్‌ఫిక్షన్‌ చిత్రాలకో ఒరవడి

క్షల ఏళ్ల క్రితం ఆటవిక మానవుడు ఉద్భవిస్తున్న వేళ... గ్రహాంతర వాసుల నుంచి ఓ అంతరిక్ష నౌక ఆఫ్రికా ఎడారిలోకి వచ్చింది... వాళ్లని చూసిన ఆది మానవుడు ఎముకలను ఆయుధంగా వాడడం నేర్చుకున్నాడు... కొన్ని లక్షల సంవత్సరాల తరువాత... చంద్రుడి ఉపరితలం మీద కప్పెట్టి ఉన్న మరో గ్రహాంతర వాసుల నౌకను ఆధునిక మానవులు కనుగొన్నారు. ఆ తరువాత అత్యాధునిక అంతరిక్ష నౌకలో మానవుడు గురుగ్రహంపైకి ప్రయాణం సమకట్టాడు. ఆ అంతరిక్ష నౌకను ‘హెచ్‌ఏఎల్‌ 9000’ అనే సూపర్‌ కంప్యూటర్‌ పర్యవేక్షిస్తుంది.... ఈ కథ వింటే ఏమనిస్తుంది? ఇదేదో తాజాగా రాబోతున్న ఓ హాలీవుడ్‌ సినిమా కథ అయ్యుంటుందనిపిస్తుంది కదూ! కానీ కాదు... ఇది ఎప్పుడో 1968లో వచ్చిన ఓ సైన్స్‌ఫిక్షన్‌ సినిమా కథ. ఆ కాలానికి అంతరిక్ష ప్రయాణమే ఓ అద్భుతం. అలాంటిది రాబోయే కాలంలో మానవుడి గమనం ఎలా ఉంటుందనే అంశాన్ని తీసుకుని అత్యంత సహజంగా తీసిన సినిమానే ‘2001: ఎ స్పేస్‌ ఒడిస్సీ’. ప్రఖ్యాత దర్శకనిర్మాత స్టాన్లీ క్యుబ్రిక్‌ రూపొందించిన ఈ సినిమా వెండితెరపై, అంతరిక్ష సరిహద్దుల్ని చెరిపేసింది. టికెట్‌ కొనుక్కుని థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుల్ని అట్నుంచి అటే రోదసిలోకి ప్రయాణం చేయించింది. మానవుడి పరిణామ క్రమం నుంచి సాంకేతికత, కృత్రిమ మేథ, గ్రహాంతర వాసుల ఉనికి, ఆధునిక అంతరిక్ష నౌకలు, కంప్యూటర్‌ నియంత్రణ... ఇలాంటి ఎన్నో విషయాలను కళ్ల ముందుంచిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసింది. ఆస్కార్‌ సహా ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న ఇది, 12 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి ఏకంగా 190 మిలియన్‌ డాలర్లను వసూలు చేసి సంచలనం సృష్టించింది. ‘సినీ చరిత్రలో ఓ మేటి సినిమా’గా గుర్తింపు పొందింది. ఎన్నో సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలకు ఇది ఓ బాట వేసింది. దీనికి కొనసాగింపుగా ‘2010: ద ఇయర్‌ ఉయ్‌ మేక్‌ కాంటాక్ట్‌’ సినిమా 1984లో వచ్చింది. - ఈ సినిమాలో మొదటి 25 నిమిషాలు ఒక్క డైలాగ్‌ కూడా ఉండదు. అలాగే ఆఖరి 23 నిమిషాలు కూడా ఎలాంటి సంభాషణలు ఉండవు. - ఇందులో మొత్తం 205 స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ షాట్స్‌ ఉన్నాయి. - బ్రిటిష్‌ సైన్స్‌ఫిక్షన్‌ రచయిత ఆర్థర్‌ సి. క్లార్క్‌ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా కథను అల్లుకున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.