అవినీతి రాజుగారి కథకు ఆస్కార్లు

అధికారం ఎంత పనైనా చేస్తుంది. నిజాయితీ పరుడిని అవినీతి నేతగా మార్చేస్తుంది. నీతులు చేప్పినవారి చేతనే నేరాలు చేయిస్తుంది. అదే ‘ఆల్‌ ద కింగ్స్‌ మెన్‌’ కథ. మూడు ఆస్కార్లు గెలుచుకున్న సినిమా కథ. అమెరికా నవలా రచయిత రాబర్ట్‌ పెన్‌ రాసిన నవల ఆధారంగా దీన్ని తీశారు. ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్‌ పురస్కారాన్ని అందుకున్న ఈ నవల స్ఫూర్తిగా 1949లో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు, ఆస్కార్‌ సహా అనేక పురస్కారాలు అందుకుంది. నీతి నిజాయితీలను నెలకొల్పాలనే ఉద్దేశంలో రాజకీయాల్లోకి వచ్చిన ఓ వ్యక్తి, అధికార చదరంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ కరడు కట్టిన అవినీతి నేతగా ఎందుకు మారాడనేదే సినిమా కథాంశం. ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన కౌంటీ సీటు నుంచి గవర్నర్‌ స్థాయి వరకు ఎదిగిన వ్యక్తి కథగా ఇది ఉంటుంది. సినిమా మొత్తం ఓ పత్రికా విలేకరి దృష్టి కోణంలో సాగుతూ ఆకట్టుకుంటుంది. రాజకీయ రంగంలో పాతుకుపోయిన అవినీతి, నేర రాజకీయాలను కళ్లకు కట్టిన ఈ చిత్రానికి రాబర్ట్‌ రాసెన్‌ దర్శకత్వం వహించాడు. ప్రధాన పాత్రలో ప్రముఖ నటుడు బ్రొడెరిక్‌ క్రాఫోర్డ్‌ నటించి, ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందకున్నాడు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.