‘అవతార్‌’ కాచుకో వస్తున్నా..

ఈ శుక్రవారం బాక్సాఫీసు వద్ద సునామీ మొదలవబోతోంది! థియేటర్ల ముందు క్యూలు కిక్కిరిసిపోనున్నాయి. క్షణాల్లో హౌస్‌ఫుల్‌ బోర్డులు వేలాడనున్నాయి. ఆన్‌లైన్‌ బుకింగ్‌ చూస్తే ఇప్పటికే టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ‘అవతార్‌’ రికార్డులు కూడా బద్దలవడం పక్కా అన్నట్లుంది ఈ సందడి. ఎందుకంటే ఆ రోజు రాబోతున్నది చిన్నా చితకా హీరోస్‌ కాదు... ది గ్రేట్‌ సూపర్‌ హీరోస్‌.. అవెంజర్స్‌! శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న హాలీవుడ్‌ చిత్రం ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న ఈ చిత్రం థియేటర్లలో ఇంకెన్ని సంచలనాలు రేపనుందో అనే ఆసక్తి నెలకొంది.


ఇప్పటివరకూ ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది ‘అవతార్‌’. సుమారు పదేళ్ల క్రితమే 278 కోట్ల డాలర్లకుపైగా వసూలు చేసిందా చిత్రం. ఇప్పటివరకూ ఏ చిత్రమూ దాన్ని దాటలేకపోయింది. అయితే ‘అవెంజర్స్‌’ సిరీస్‌లో వస్తున్న నాలుగో చిత్రం ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’కు ఆ ఘనత సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భావిస్తున్నారు ట్రేడ్‌ విశ్లేషకులు. విడుదలకు ముందు జరిగిన వ్యాపారం, ప్రపంచవ్యాప్తంగా విడుదల  కాబోతున్న థియేటర్ల సంఖ్య, విస్తృతంగా చేసిన ప్రచార కార్యక్రమాలను పరిశీలిస్తే అది సాధ్యమే అని చెబుతున్నారు.

సెకనుకు 18 టికెట్లు
గతేడాది విడుదలైన ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’ భారత్‌లో రూ.298 కోట్లు సాధించి అత్యధిక వసూళ్లందుకున్న హాలీవుడ్‌ చిత్రంగా నిలిచింది. ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’పైనా ఇక్కడ అమితాసక్తి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆ చిత్ర దర్శకుడు జో రుస్సో భారత్‌కు వచ్చి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఏఆర్‌ రెహమాన్‌తో ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ఈ చిత్రాన్ని ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళం భాషల్లో త్రీడీ, టూడీల్లో విడుదల చేస్తున్నారు. దీంతో ఈ సినిమా ఆన్‌లైన్‌ బుకింగ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. బుక్‌ మై షో ఆప్‌లో తొలి 24 గంటల్లోనే పది లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని ఆ సంస్థ వెల్లడించింది. అంటే సెకనుకు 18 టికెట్లు! విదేశాల్లో అయితే ‘ఎండ్‌గేమ్‌’ సందడి మామూలుగా లేదు. అమెరికాలో ఫ్యాన్‌డాంగో బుకింగ్‌ ఆప్‌లో ‘స్టార్‌ వార్స్‌: ది ఫోర్స్‌ అవేకెన్స్‌’కు 24 గంటల్లో అమ్ముడైన టికెట్ల సంఖ్యను ‘ఎండ్‌గేమ్‌’ ఎనిమిది గంటల్లోనే అధిగమించేసి తొలి స్థానంలో నిలిచిందట. చైనాలోనూ ఆన్‌లైన్‌ బుకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

థియేటర్ల జాతర
సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది ‘ఎండ్‌గేమ్‌’. అమెరికా, కెనడాల్లోనే 4600కు పైగా థియేటర్లలో ప్రదర్శితం కానుంది. ఈ విషయంలోనూ రికార్డు సృష్టించిందీ చిత్రం. భారత్‌లో అయితే బాలీవుడ్‌ చిత్రాలకు దీటుగా అత్యధిక థియేటర్లలో ‘ఎండ్‌గేమ్‌’ విడుదలవుతోంది. ప్రధాన నగరాల్లో 24 గంటల పాటూ షోలు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇది ఇండియాలో ఈ ఏడాది అత్యధిక తొలి రోజు వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచినా ఆశ్చర్యం లేదని బాలీవుడ్‌ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఐదు వందలకు పైగా థియేటర్లలో ప్రదర్శితం కానుంది.

తొలి రోజు వంద అందేనా
గురువారం రాత్రి ప్రదర్శించనున్న ప్రీమియర్‌ షోలకు విశేష స్పందన వస్తోంది. ఆ వసూళ్ల విషయంలోనూ ఈ చిత్రం గత రికార్డులు బద్దలుకొట్టడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తొలి రోజు వసూళ్ల విషయంలోనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇంతవరకూ ఏ చిత్రానికి సాధ్యంకాని వంద కోట్ల డాలర్ల మార్కును ‘ఎండ్‌గేమ్‌’ అందుకుంటుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’ తొలిరోజు 64 కోట్ల డాలర్లకు పైగా వసూళ్లు సాధించి అగ్రస్థానంలో ఉంది. అయితే ఆ చిత్రం కన్నా భారీస్థాయిలో ‘ఎండ్‌గేమ్‌’ విడుదలవుతున్నందున్న ఆ సినిమా వంద కోట్ల డాలర్ల తొలిరోజు వసూళ్లు అందుకోవడం సాధ్యమే అని అంటున్నారు.
ఆంటోనీ రుస్సో, జో రుస్సో, తెరకెక్కించిన ఈ చిత్రం అవెంజర్స్‌ అనే సూపర్‌ హీరోల బృందం, విశ్వాన్ని అంతం చేసేందుకు ప్రయత్నించే థానోస్‌ అనే దుర్మార్గుణ్ని ఎలా అంతం చేసిందన్న కథతో తెరకెక్కింది. రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్‌ ఇవాన్స్‌, మార్క్‌ రఫెలో, క్రిస్‌ హేమ్స్‌వర్త్‌, స్కార్లెట్‌ జాన్సన్‌, బ్రీ లార్సన్‌, బ్రాడ్లీ కూపర్‌ లాంటి ప్రముఖ నటులు నటించారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.