సెకన్‌కు 18 టికెట్లు.. రోజులో పదిలక్షల టికెట్లు

‘అవెంజర్స్‌’ సిరీస్‌ నుంచి వస్తోన్న ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా ‘అవతార్‌’ పేరిట ఉన్న అత్యధిక వసూళ్ల రికార్డు (రూ. 18,800 కోట్లు)ను తిరగరాయడం ఖాయమని ఇప్పటికే సినీ పండితులు తేల్చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి తగ్గట్లుగానే అడ్వాన్స్‌ బుకింగ్‌ల్లో ఎండ్‌గేమ్‌ జోరు నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్‌ 26న విడుదల కాబోతుండగా.. భారత్‌లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్‌ భాషల్లో కనువిందు చేయబోతుంది. కాగా.. బుక్‌ మై షోలో అడ్వాన్స్‌ టికెట్లు అందుబాటులోకి తీసుకురాగా ఇప్పటి వరకు పది లక్షల టికెట్లు అమ్ముడు పోయాయట. అంటే క్షణానికి 18 టికెట్లను కొనుగోలు చేసేశారట సినీప్రియులు. ఈ విషయాన్ని బుక్‌ మై షో సీఈఓ ఆశిష్‌ సక్సేనా వెల్లడించారు. ‘‘అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ మున్ముందు మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని ఆశిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. మార్వెల్‌ సంస్థ నుంచి వస్తోన్న 22వ చిత్రమిది. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 500 పైగా స్క్రీన్లలో ప్రదర్శితం కాబోతుంది. ఓ హాలీవుడ్‌ చిత్రం ఇంత భారీ స్థాయిలో ఇక్కడ విడుదల కాబోతుండటం ఇదే తొలిసారి. రాబర్ట్‌ డౌనీ జూనియర్, క్రిస్‌ ఇవాన్స్, మార్క్‌ రుఫలో ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకులు ఆంటోని రుస్సో, జో రుస్సో సంయుక్తంగా తెరకెక్కించారు.

సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.